తెలుగు భాషలో ఛార్జ్ షీట్ స్వ‌రూప హ్యాట్సాఫ్‌

పోలీసు శాఖలో సరికొత్త అధ్యాయం

హైదరాబాద్ : సాధారణంగా పోలీస్ దర్యాప్తు, కోర్టు పత్రాలు అంటే అంతా ఇంగ్లీష్‌మయం.. కానీ ఆ విధానానికి స్వస్తి పలికి, సామాన్యులకు అర్థమయ్యేలా మన మాతృ భాష తెలుగులో అభియోగ పత్రం (Charge Sheet) దాఖలు చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు దుండిగల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ స్వరూప. త‌న‌కు ముందు నుంచి త‌ల్లి భాష అంటే ఎన‌లేని ప్రేమ‌. తాను జాబ్ లో కొలువు తీరిన నాటి నుంచి నేటి వ‌ర‌కు ఇంగ్లీష్ లో కాకుండా తెలుగులోనే ఫిర్యాదుల‌ను స్వీక‌రించ‌డం, వాటిని న‌మోదు చేయ‌డం చేస్తూ వ‌స్తున్నారు స్వ‌రూప‌.

​మాతృ భాషపై మక్కువ కార‌ణంగా ఓ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇంగ్లీష్ రాని సామాన్యులకు కూడా కేసు వివరాలు అర్థం కావాలనే ఉద్దేశంతో 2025లో రెండు కేసుల దర్యాప్తు నివేదికలను పూర్తిగా తెలుగులోనే కోర్టుకు సమర్పించారు స్వ‌రూప‌. అంతే కాకుండా ఒక మిస్సింగ్ కేసును వేగంగా ఛేదించి, తల్లి బిడ్డలను క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించి తన కర్తవ్యాన్ని చాటుకున్నారు . ఏసీపీ శంకర్ రెడ్డి సహకారంతో మేడ్చల్ కోర్టులో ఈ తెలుగు అభియోగ పత్రాలను దాఖలు చేయడం విశేషం.

​తెలంగాణ రాష్ట్ర అధికార భాషలో దర్యాప్తు పూర్తి చేసినందుకు గాను, ఇటీవల బంజారాహిల్స్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి ప్ర‌త్యేకంగా ప్ర‌శంస‌లు కురిపించారు. అంతే కాకుండా ఆమెకు ప్ర‌శంసా ప‌త్రాన్ని, మెడ‌ల్ ను బహూక‌రించారు.

Leave A Reply

Your Email Id will not be published!