సింహ‌ వాహనంపై శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌రుడు

యోగ న‌ర‌సింహుడి అలంకారంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం

తిరుప‌తి : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. మూడో రోజు మంగ‌ళ‌వారం ఉదయం 8 గంట‌లకు అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగ న‌ర‌సింహుడి అలంకారంలో సింహ‌ వాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు. వాహనం ముందు వృషభాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.

శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌ స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు చెబుతున్నారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్య‌పు పందిరి వాహనంపై స్వామివారు కటాక్షించారు.

వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, విజివో గిరిధర్, ఏఈవో గోపినాథ్‌, సూపరింటెండెంట్ రాజ్‌కుమార్‌, కంకణ భట్టార్ బాలాజి రంగాచార్యులు, అర్చకులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్‌, ధ‌న శేఖ‌ర్‌, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!