బ్ర‌హ్మోత్స‌వాల‌లో భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు

తొమ్మిది రకాల వంటకాలతో మహా ప్రసాదం

తిరుపతి : శ్రీనివాస మంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు విచ్చేస్తుండగా, వారి సౌకర్యార్థం టీటీడీ దాతల సహకారంతో ప్రతిరోజూ రుచికరమైన అన్నప్రసాదాలను నిరంతరాయంగా అందిస్తోంది. భక్తులు ఈ సేవపై ఆనందం వ్యక్తం చేస్తూ టీటీడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టీటీడీ అనాదిగా ఉచిత అన్నప్రసాద వితరణను యజ్ఞంగా నిర్వహిస్తోంది. ఇదే విధంగా టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా దాతల సహకారంతో అన్నప్రసాదాల వితరణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.

టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ఎం. రవిచంద్ర ఆదేశాల మేరకు, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ ప్రత్యేకాధికారి డా.టి. రవి పర్యవేక్షణలో, ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్ ఆధ్వర్యంలో ఈ అన్నప్రసాద సేవ సమర్థవంతంగా కొనసాగుతోంది. ప్రతిరోజూ ఉదయం సుమారు 700 మంది భక్తులకు పొంగలి, సేమియా ఉప్మా, టమాటా రైస్, కిచిడి, వెజ్ రైస్, చట్నీ, కేసరి వంటి పదార్థాలు అందిస్తున్నారు. మధ్యాహ్నం అన్నం, ఆకుకూర పప్పు, చట్నీ, సాంబారు, రసం, పెరుగు, అప్పడాలు, స్వీటు, అరటిపండు తదితర తొమ్మిది రకాల వంటకాలతో మహా ప్రసాదం వడ్డిస్తున్నారు. రాత్రి సుమారు 700 మందికి దొండకాయ రైస్, కిచిడి, టమాటా రైస్, వెజ్ రైస్ అందిస్తున్నారు.

టీటీడీ అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఉదయం పొంగలి, ఉప్మా, వడ, చట్నీ, సాంబారు, మధ్యాహ్నం, రాత్రి సాంబారు అన్నం, పెరుగు అన్నం నిరంతరాయంగా పంపిణీ చేస్తున్నారు. శుభ్రత, రుచితనం, సమయపాలనతో నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద సేవ భక్తుల ప్రశంసలు అందుకుంటోంది.

Leave A Reply

Your Email Id will not be published!