ఎంపీ పుట్టా మహేష్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి

డిమాండ్ చేసిన మాజీ ఎంపీ మార్గాని భరత్

రాజమండ్రి : తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన ఘటనపై మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలోని వైయస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై, చంద్రబాబు నాయుడి తీరుపై ధ్వజమెత్తారు. సాక్షాత్తూ లోక్ సభ సభ్యుడు పుట్టా మహేష్ యాదవ్ ఇతర మాజీ ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తలతో కలిసి రేవ్ పార్టీలో డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు చిక్కడం రాష్ట్రానికే అవమానకరం అని అన్నారు. బయట డ్రగ్స్ నిర్మూలన గురించి ఉపన్యాసాలు ఇచ్చే చంద్రబాబు, లోపల ఇలాంటి డ్రగ్స్ బానిసలను చట్టసభల్లో కూర్చోబెట్టారని ధ్వజమెత్తారు. పట్టుబడిన తర్వాత కూడా పోలీసుల (ఈగిల్ టీం) పైనే కాల్పులు జరపడం గుండా రాజ్యానికి నిదర్శమని అన్నారు.

డ్రగ్స్ సేవిస్తూ దొరికిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు అని తెలిపారు. ఇంత దారుణంగా అధికార పార్టీ ఎంపీ ఇలా డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడినా ఇంకా తెలుగుదేశం పార్టీ స్పందించక పోవడం దారుణం అన్నారు మార్గాని భ‌ర‌త్. తక్షణమే త‌న‌ను ఎంపీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయనతో ఎందుకు రాజీనామా చేయించడం లేదని ప్ర‌శ్నించారు. డ్రగ్స్ నిర్మూలించాలని బయట ప్రచారాలు చేస్తూ.. లోపల మాత్రం అవే డ్రగ్స్ తీసుకుంటూ పట్టు బడటం సిగ్గు చేటు అనిపించ‌డం లేదా అని నిల‌దీశారు మాజీ ఎంపీ.

Leave A Reply

Your Email Id will not be published!