వేసవి రద్దీకి తిరుమలలో విస్తృత ఏర్పాట్లు

ప్ర‌క‌టించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం

తిరుమ‌ల : తిరుమ‌ల‌కు పోటెత్తారు శ్రీ‌వారి భ‌క్తులు. వేసవి సెలవులు, అధిక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేప‌ట్టింది. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా అన్ని స‌దుపాయాల‌ను అందుబాటులో ఉంచ‌డం జ‌రిగింది. వేస‌వి ర‌ద్దీ నేప‌థ్యంలో టీటీడీ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టడం జ‌రిగింది. ఇందుకోసం సుమారు రూ.2 కోట్లతో పనులు చేపట్టడం జరిగింది. భక్తులకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కల్పించేందుకు బాటగంగమ్మ సర్కిల్ నుండి గోగర్భం డ్యామ్ సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్ వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేసింది. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో నీడనిచ్చే షెల్టర్లు ఏర్పాటు చేశారు.

క్యూ లైన్లలో వేచి ఉండే భక్తుల కోసం కూల్ పెయింటింగ్ పనులు, అదనపు తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా శ్రీవారి ఆలయం పరిసరాలు, లడ్డూ కౌంటర్లు, భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పందిళ్ల నిర్మాణం చేపట్టారు.ఇదే సమయంలో నాలుగు మాడ వీధుల్లో సింథటిక్ ఎనామెల్ కూల్ పెయింట్ వేయడం ద్వారా భక్తులు నేల వేడి నుండి ఉపశమనం పొందేలా చర్యలు తీసుకున్నారు.బాట గంగమ్మ గుడి సర్కిల్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఏర్పాటు చేసిన క్యూలైన్లలో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.

అదేవిధంగా టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు మొబైల్ వాటర్ డ్రమ్ములతో ఎప్పటికప్పుడు తాగునీరు పంపిణీ చేయడం జరుగుతోంది. వేసవి నేపథ్యంలో భక్తులు తాగునీటికి ఇబ్బంది పడకుండా శ్రీవారి సేవకులు నేరుగా భక్తుల వద్దకే వెళ్లి తాగు నీరు అందిస్తున్నారు. ఒక బ్యాచ్ లో 15 మంది వంతున, మొత్తం మూడు బ్యాచుల్లో రోజుకు 45 మంది శ్రీవారి సేవకులు భక్తులకు తాగునీరు అందిస్తున్నారు.

మరోవైపు ద‌ర్శ‌న క్యూలైన్ల‌లో పారిశుద్ధ్యానికి పెద్ద‌పీట వేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు చెత్త‌ను తొల‌గిస్తూ భ‌క్తుల‌కు ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణం ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. తిరుమ‌ల‌లో మొత్తం 16 వైద్య కేంద్రాలు భ‌క్తుల‌కు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్ర‌దేశాల్లో భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన త‌క్ష‌ణ వైద్య సేవ‌లు అందించ‌బ‌డ‌తాయి. ర‌ద్దీకి అనుగుణంగా ఔట‌ర్ రింగ్ రోడ్డులో క్యూలైన్ల వెంబ‌డి ఒక మొబైల్ ఫ‌స్ట్ ఎయిడ్ సెంట‌ర్ అందుబాటులో ఉంచ‌డం జ‌రిగింది. అదేవిధంగా నారాయ‌ణ‌గిరి వ‌ద్ద ఫ‌స్ట్ ఎయిడ్ సెంట‌ర్ అందుబాటులో ఉంటుంది.

Leave A Reply

Your Email Id will not be published!