శ్రీవారి అభిషేక వేళ సామాన్య భక్తులకు దర్శన భాగ్యం

శుక్రవారం రోజున రికార్డు స్థాయిలో భక్తులకు దర్శనం

తిరుమల : భక్తుల సౌకర్యాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ శ్రీవారి అభిషేక సేవ సందర్భంగా వేలాది మంది సామాన్య భక్తులకు శ్రీవారి దివ్య దర్శన భాగ్యాన్ని అందించింది . ఆలయంలో టీటీడీ సమన్వయంతో చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్ల కారణంగా మొత్తం 87,689 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల చరిత్రలో ఇంత భారీ సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పించడం ఇదే తొలిసారి కావడం విశేషం. సామాన్య భక్తునికి అభిషేక సేవ వీక్షణం క‌ల్పించడంతో జన్మ సాఫల్యం చెందింది.

ప్రత్యేకించి శ్రీవారి అభిషేక సేవ కొనసాగుతున్న సమయంలోనే సుమారు 5850 మంది సామాన్య భక్తులకు టీటీడీ దర్శనం కల్పించింది. ప్రతి శుక్రవారం ఉదయం వివిధ ద్రవ్యాలతో చేసే ఎంతో ఉత్కృష్టమైన అభిషేక సేవను జీవితంలో ఒకసారైనా వీక్షించాలని శ్రీవారి భక్తులు కలలుకంటారు. ఆ కలను సాకారం చేస్తూ సామాన్య భక్తులకు అభిషేక సేవ సమయంలో టీటీడీ అత్యధిక సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పించడంతో వారు ఆనందంతో పరవశించారు. మరోవైపు భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ, క్యూలైన్ల నిర్వహణ, దర్శన సమయ సమన్వయం, అన్నప్రసాదాల పంపిణీ, తాగునీటి సదుపాయాలు తదితర అంశాల్లో టీటీడీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

శ్రీవారి కైంకర్యాలు కొనసాగుతున్నప్పటికీ సామాన్య భక్తులకు నిరంతర దర్శన సౌకర్యం కల్పించడం ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించారు. కాగా వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు భారీగా తరలివస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అన్ని విభాగాలు సమన్వయంతో పని చేస్తున్నాయి. టీటీడీ అధికారులు, క్యూలైన్లను నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తుల కోసం విశేషంగా శ్రమిస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుండి వ‌చ్చే భ‌క్తులు టీటీడీ క‌ల్పిస్తున్న సౌక‌ర్యాలు, సేవ‌ల ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!