గోదావరి పుష్కరాలకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలి
ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల
అమరావతి : ఏపీ కూటమి సర్కార్ గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. పుష్కరాలను పురస్కరించుకుని రాజ మహేంద్రవరం పుష్కరాల ఘాట్ నుంచి గోదావరిలో పడవ మీదుగా పుష్కరాల పనులు, గోదావరి తీర ప్రాంతం కాలుష్యం ప్రత్యక్షంగా పరిశీలించారు. కాలుష్య రహిత గోదావరి అనే లక్ష్యంతో గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకమైన రీతిలో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. దీనికి అనుగుణంగా ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు పవన్ కల్యాణ్ కొణిదల.
నల్లా ఛానెల్ నుంచి గోదావరిలోకి నేరుగా కలుస్తున్న కాలుష్యకారక వ్యర్ధాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఉప ముఖ్యమంత్రి. గోదావరి పేపర్ మిల్ వ్యర్ధ జలాలు ఎక్కడ శుద్ధి చేస్తున్నారని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్యను ప్రశ్నించారు. ఈ మేరకు వివరాలు వెల్లడించారు డిప్యూటీ సీఎం కు. రోజువారి వ్యర్ధాలను ఎలా వేరు చేస్తున్నారని వచ్చే మురికి నీటిని ఎలా శుద్ధి చేస్తున్నారని, శాస్త్రీయ పద్ధతిని అనుసరిస్తున్నారా అని ఆరా తీశారు. నల్లా ఛానల్ ద్వారా రోజువారి ఎన్ని మిలియన్ లీటర్ల మురుగునీరు గోదావరిలోకి నేరుగా వస్తోంది..? దీనిలో ఎంత భాగం నీరు శుద్ధి అవుతోంది అన్న విషయంపై ప్రశ్నించారు.
రోజువారి సుమారు 55 ఎం.ఎల్.డి. ల మేర మురుగు నీరు రాజమహేంద్రవరంలో గృహాల నుంచి విడుదల అవుతోందనీ, దీనిలో కేవలం 15 శాతం మేర మాత్రమే సీవరేజ్ ప్లాంట్ల ద్వారా నీరు శుద్ధి అవుతోంది అని వివరించారు. కేంద్రం ద్వారా వచ్చే నిధులను పారదర్శకంగా వినియోగించు కోవాలని, మురుగు నీటిని పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన తర్వాత గోదావరి లోకి వదిలేలా చూడాలని సూచించారు.
