#GaneshPatro : మాటల మాంత్రికుడు గణేష్ పాత్రో
Ganesh Patro: తెలుగు చిత్ర సీమ లో చెరగని సంతకం గణేష్ పాత్రో. సినిమాలను బట్టి, పాత్రలకు సమయోచితంగా, సందర్భాను సారంగా మాటలు రాయడంలో ఆయనకు ఆయనే సాటి.
Ganesh Patro: తెలుగు చిత్ర సీమ లో చెరగని సంతకం గణేష్ పాత్రో. సినిమాలను బట్టి, పాత్రలకు సమయోచితంగా, సందర్భాను సారంగా మాటలు రాయడంలో ఆయనకు ఆయనే సాటి. దర్శకుడి ఆలోచనలను అర్థం చేసుకుని, అందుకు అను గుణంగా సంభాషణలు రాయడం అన్నది మామూలు విషయం కాదు. అంత సులువు కానే కాదు. దర్శకుని మనోభావాలు ప్రతిబింబించేలా రచయిత సంభాషణలు రాస్తేనే సదరు సినిమా ప్రేక్షకుల ఆదరాన్ని చూర గొంటున్నదన్న మాట యదార్థం. కొందరు దర్శకులకు, కొందరు రచయితలతో కలిసి పనిచేయడం చాలా అనుకూలంగా ఉంటుంది. బహుశా, ఈ కారణంగానే చాలామంది రచయితలకు ఎక్కువమంది దర్శకులతో పనిచేసే అవకాశం దొరకదు. కానీ, గణేష్ పాత్రోకు తన సినీ రంగ కలిసి చేసిన ప్రయాణంలో దర్శకులందరూ వైవిధ్యాన్ని కోరుకునే వారే. వెండితెర మీద తమదైన ముద్ర వేదుకున్న వారే. బాల చందర్ తో పాటు, సింగీతం శ్రీనివాసరావు, క్రాంతికుమార్ వంశీ, కోడి రామకృష్ణ, ఇంకా నేటితరం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఎవరి శైలి వాళ్ళది. తెలుగు వెండతెరపై ఎవరి ప్రత్యేకత వారిది. వారు కోరుకున్న విధంగా, వారి అభిరుచులకు అనుగుణంగా సంభాషణలు రాసి మెప్పించిన ఘనత మాత్రం గణేష్ పాత్రోదే. గణేష్ పాత్రో కథలు, నాటికలు సమకాలీన పరిస్థితులకి, మధ్యతరగతి కుటుంబాలలోని మనుషుల అంతరంగాలు, సంఘర్షణలకు ప్రతి బింబాలుగా నిలుస్తాయి. అందుకే దర్శకులు నిర్మాతలు ఆయన రచనలు ఇష్ట పడ్డారు. ప్రేక్షకులు ఆదరించారు.
గణేష్ పాత్రో పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చే మరో పేరు కె. బాలచందర్. పందొమ్మిది వందల డెబ్భై, ఎనభై దశకాల్లో తెలుగు తెరమీద బాలచందర్, పాత్రో కాంబినేషన్ విజయాల పరంపర కొనసాగించు కుంది. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ప్రతి చిత్రానికి తెలుగులో గణేష్పాత్రోనే సంభాషణలు రాశారు. బాలచందర్ తమిళ ఆలోచనలకు అచ్చ తెలుగు మాటలను అద్దిన రచయిత గణేష్ పాత్రో. అందుకే కాబోలు బాలు, స్వప్న, జానీ, సుహాసిని, బుచ్చిబాబు, విద్య, బేబీ.. ఈ పాత్రలేవీ కూడా పరభాషా దర్శకుడు సృష్టించినవన్న భావన కలగదు. సినిమాకు స్థానికత అద్దడంలో సంభాషణలది కీలకపాత్ర. బాలచందర్ దర్శకత్వం వహించిన మరో చరిత్ర, గుప్పెడు మనసు, ఆకలి రాజ్యం, రుద్ర వీణ, ఇది కథకాదు లాంటి పలు చిత్రాలు గణేష్ పాత్రోకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. దర్శకుడు కే.బాల చందర్‌తో గణేష్‌పాత్రో అనుబంధం విడదీయ రానిది. అందుకేనేమో బాలచందర్ మరణించిన రెండు వారాలకు గణేష్ పాత్రో ఆయనను అనుసరించి వెళ్లడం గమనార్హం.
సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ, గణేష్‌పాత్రోల కలయికలో 40 చిత్రాలు తెరకెక్కడం విశేషం. ముఖ్యంగా భార్గవ ఆర్ట్స్ పిక్చర్స్ అధినేత దివంగత ఎస్ గోపాల్ రెడ్డికి ఆస్థాన రచయితగా గణేష్‌పాత్రో వ్యవహరించారు. అలాగే, ప్రముఖ దర్శకుడు క్రాంతికుమార్‌తో కలసి పలు చిత్రాలకు పనిచేశారు.
గణేష్‌పాత్రో స్వాతి చిత్రానికి 1983లో, రుద్రవీణ చిత్రానికి గాను 1988లో ఉత్తమ నంది అవార్డులను అందుకున్నారు. మయూరి చిత్రానికి గాను ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా నంది అవార్డును దక్కించు కున్నారు. 2009లో ఆయన అభిమానంగా ప్రేమించే అక్కినేని నాగేశ్వరరావు పురస్కారాన్ని, 2013లో మనసు కవి ఆత్రేయ బిరుదును అందుకున్నారు. గణేష్ పాత్రో పూర్వ శ్రీకాకుళం జిల్లా (ప్రస్తుత విజయ నగరం జిల్లా) పార్వతీ పురంలో 1945 జూన్ 22న ఆది లక్ష్మీనారాయణ పాత్రో, సూర్యకాంతం దంపతులకు జన్మించారు.
గణేష్ పాత్రో తండ్రి, పార్వతీపురం దగ్గర ఒక చిన్న గ్రామానికి కరణంగా పనిచేసేవారు. గణేష్ ప్రాథమిక విద్య అక్కడే సాగింది. పార్వతీ పురంలో ఉన్నత చదువులు చదువుతూ, నాటకాలలో నటించడం ప్రారంభించారు. పాఠశాల పుస్తకాలతో పాటు సాహిత్యాన్ని కూడా చదవటం ప్రారంభించారు. పీ.యూ.సి పూర్తయిన తర్వాత పై చదువులకు ఆంధ్ర విశ్వ విద్యాలయంలో చేరారు. అక్కడ విశ్వ విద్యాలయ సాంస్కృతిక సంఘానికి జాయింట్ సెక్రటరీగా నాటకాలు వ్రాయటం, వాటిని రంగస్థలంపై ప్రదర్శించడం ప్రారంభించారు. చిన్నప్పటి నుంచే నాటకాలు రాయడం, నటనపై గణేశ్ పాత్రో ఆసక్తి పెంచుకున్నారు. ‘పావలా’, ‘కొడుకు పుట్టాల’, ‘ఆలోచించండి’ వంటి పలు నాటకాలతో రచయితగా ప్రాచుర్యం పొందారు. ఇందులో ‘కొడుకు పుట్టాల’ నాటకానికి అంతర్జాతీయ పురస్కారం లభిం చింది. ఈ నాటకం పలు భాషల్లో అనువాదం కావడంతో పాటు ఆకాశవాణి, దూరదర్శన్ లలో ప్రసారమై, పాత్రో కు గుర్తింపు తెచ్చాయి.
1970 ప్రాంతంలో రచన ప్రారంభించిన గణేష్ పాత్రో అయిదేళ్ళ కాలంలో ప్రథమ శ్రేణి నాటక కర్తగా పేరు తెచ్చుకున్నారు. రచనలు చాలా తక్కువే అయినా, వ్రాసిన ప్రతి నాటిక, నాటకము రంగస్థలం మీద రక్తి కట్టి రసజ్ఞుల మెప్పు పొందింది. కథా వస్తువును పరి గ్రహించడంలో, కథనంలో, పాత్ర చిత్రణలో, సన్నివేశాల మేళవింపులో, మాటల కూర్పులో నిత్య నూతన పరిమళాన్ని వెదజల్లిన ప్రతిభాశాలి గణేష్ పాత్రో. సంఘటనల ద్వారా సమస్యను శక్తివంతంగా ఆవిష్కరించటం అయన రచనా విధానంలో ప్రత్యేకత. మృత్యుం జయుడు, తెరచి రాజు, తరంగాలు, అసుర సంధ్య నాటకాలూ, కొడుకు పుట్టాల, పావలా, లాభం, త్రివేణి, ఆగండి! కొంచెం ఆలోచించండి మొదలైన నాటికలు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకున్న ఉత్తమ రచనలు. 1970 నుండి 1990ల వరకు అనేక సినిమాలకు సంభాషణలు, కథను సమకూర్చారు.125కు పైగా చిత్రాలకు కథలు, మాటలను అందించారు. పదిహేనేళ్ళ విరామానంతరం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు సంభాషణలు సమకూర్చారు. “హలో గురూ ప్రేమ కోసమేరా ఈ జీవితం”… నిర్ణయం సినిమాలో పాట రాశారు. అదే ఆయన సంభాషణలు రాసిన చివరి చిత్రం.
ఆయన సినీ సంభాషణలు సమకూర్చిన చిత్రాల్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నిర్ణయం, సీతారామయ్య గారి మనవరాలు, రుద్రవీణ, తలంబ్రాలు, ప్రేమించు పెళ్ళాడు, మయూరి, మనిషికో చరిత్ర, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, మాపల్లెలో గోపాలుడు ఇలా పలు హిట్ చిత్రాలు ఉన్నాయి.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) (సంభాషణలు, శ్రీకాంత్ అడ్డాలతో కలిసి), 9 నెలలు (2001), నిర్ణయం (1991) (సంభాషణలు, పాటలు), సీతా రామయ్య గారి మనవరాలు (1991), రుద్రవీణ (1988), గౌతమి (1987), తలంబ్రాలు (1986), ప్రేమించు పెళ్ళాడు (1985), మయూరి (1984), మనిషికో చరిత్ర (1984), గుప్పెడు మనసు (1979) (సంభాషణలు), ఇది కథ కాదు (1979), మరో చరిత్ర (1978), అత్తవారిల్లు (1976) తదితర చిత్రాలకు పనిచేశారు.
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొంది, గణేష్ 69 ఏళ్ళ వయసులో 2015, జనవరి 5న తెలుగు సినిమా పుస్తకంలో చెరగని సంతకం చేసి కన్నుమూశారు.

No comment allowed please