#Madhubala : మ‌ధుబాల ..రూపం అపురూపం..జ్ఞాపకం మధురం

Madhubala : భారతీయ సినీ జగత్తులో మరిచి పోలేని జ్ఞాపకం మధుబాల. ఎంత చెప్పినా తక్కువే. తెలుగులో సావిత్రి..బాలీవుడ్ లో మధుబాల గొప్ప నటీమణులుగా పేరు తెచ్చుకున్నారు. 1933 లో పుట్టిన ఆమె 1969 లో మృతి చెందారు. 1950 ల నుండి 1960 కాలంలో ఆమె ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించారు. వీటిలో ఎక్కువ భాగం కావ్య స్థాయిని పొందాయి. తన సమకాలికులైన నర్గీస్, మీనా కుమారిలతో పాటు అత్యంత ప్రతిభావంతులైన హిందీ చిత్ర నటీమణులలో ఒకరిగా మధుబాల(Madhubala) విస్తృత గౌరవాన్ని పొందారు.

సాంప్రదాయ ముస్లిం దంపతుల పదకొండు మంది సంతానంలో ఈమె ఐదవ వ్యక్తి. ఇదే సమయంలో మధుబాల తండ్రి అతుల్లా ఖాన్ పెషావర్‌లోని ఇంపీరియల్ టొబాకో కంపెనీలో తన ఉద్యోగాన్ని కోల్పోయిన తర్వాత తన కుటుంబాన్ని ముంబైకి మార్చారు. ముంతాజ్ తొమ్మిది సంవత్సరాల వయసులో చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు.మొదటి సారి నటించిన చిత్రం బసంత్ బాక్స్-ఆఫీస్ వద్ద విజయవంతమైంది. బాలనటిగా ఆమె అనేక చిత్రాలలో నటించడాన్ని కొనసాగించారు. నటీమణి దేవికా రాణి ఆమె నటనకు, సామర్ధ్యానికి ముగ్దులై ఆమెకు మధుబాల అనే పేరు పెట్టుకోమని సలహా ఇచ్చారు.

మధుబాల త్వరగానే ఒక విశ్వసనీయమైన వృత్తి పరమైన నటిగా కీర్తిని సంపాదించుకున్నారు. యుక్త వయసులో ప్రధాన పాత్రల కొరకు శిక్షణ తీసుకున్నారు. నిర్మాత కిదార్ శర్మ ఆమెను రాజ్ కపూర్‌కి ప్రతిగా నీల్ కమల్ చిత్రంలో నటింప చేశారు. ప్రధాన పాత్ర ధరించినపుడు ఆమె వయసు పద్నాలుగు ఏళ్ళు. ఈ చిత్రం వాణిజ్య పరంగా విజయవంతం కాలేదు, అయితే ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. రెండు ఏళ్ళ తర్వాత మధుబాల ఆకర్షణీయమైన అందగత్తెగా ఎదిగారు. బోంబే టాకీస్ చిత్రం మహల్ లో ప్రధాన పాత్రను పోషించారు. అది బిగ్ హిట్.

ఆ సమయంలో ఆమె వయసు 16 సంవత్సరాలే అయినప్పటికీ, నైపుణ్యంతో కూడిన నటన సహ నటుడు అశోక్ కుమార్‌ను ఆకర్షించింది. మధుబాల (Madhubala)తనను తాను వైవిధ్యమైన నటిగా నిరూపించు కున్నారు. బాదల్ మూవీలో మూస ధోరణిలో ఉత్తమ స్త్రీ పాత్ర ధరించారు. తరానాలో ఎదురు లేని అందమైన పల్లెటూరి పడుచుగా నటించారు. సాంప్రదాయ ఆదర్శ భారత స్త్రీగా ఆమె సంగ్ దిల్ లో ఒదిగి పోయారు. మార్గం తప్పిన వారసురాలు అనితగా గురుదత్ వ్యంగ్య చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మూవీలో హాస్య పాత్రలో నటించారు. సమకాలీన పాత్రల చిత్రణలో సమానమైన విజయంతో, సాంఘిక చిత్రం కల్ హమారా హై లో ద్వంద్వ పాత్రలతో గుర్తుండి పోతారు.

1958లో వరుస విజయాలతో ఆమె తన వృత్తి జీవితాన్ని మలుపు తిప్పారు. హౌరా బ్రిడ్జ్ చిత్రంలో అశోక్ కుమార్ కు ప్రతిగా మధుబాల అసాధారణమైన ఆంగ్లో ఇండియన్ కేబరే గాయనిగా నటించారు. ఫాగున్ ‌లో భరత్ భూషణ్‌కు ప్రతిగా, కాలాపానీలో దేవ్ ఆనంద్‌కు, శాశ్వత విజయాన్ని పొందిన చల్తీ కా నామ్ గాడీలో కిషోర్ కుమార్‌తోనూ బర్సాత్ కి రాత్ లో భరత్ భూషణ్‌కు ప్రతిగా నటించారు. కిషోర్ కుమార్ హిందూ, మధుబాల ముస్లిం కావడంతో 1960లో వారు పౌర వివాహం చేసుకున్నారు. దానికి హాజరు కావడానికి ఆయన తల్లిదండ్రులు నిరాకరించారు.

కుమార్ తల్లిదండ్రులను సంతృప్తి పరచడానికి ఈ జంట హిందూ వేడుకను కూడా జరుపుకున్నారు, కానీ మధుబాల ఎప్పుడూ అతని నిజమైన భార్య కాలేక పోయారు. కుమార్ గృహంలో కలతల కారణంగా వివాహమైన నెల రోజుల్లోనే ఆమె తన బాంద్రా భవంతికి తిరిగి వచ్చారు. మధుబాల శేష జీవితమంతా విపరీతమైన ఒత్తిడితోనే కొనసాగింది. ఇక మధుబాల అంటేనే ముఘల్-ఏ-ఆజం. ఇప్పటికీ ఎప్పటికీ మరిచి పోలేని సినిమా అది. ఈ ఒక్క సినిమాతో ఆమె కీర్తి నలుదిశలా పాకింది. కొద్దీ కాలం మాత్రమే బతికిన మధుబాల (Madhubala)ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటారు.

No comment allowed please