YS Jagan : చిరు వ్యాపారుల‌కు రూ. 510.46 కోట్లు

మూడో విడ‌త‌ను ప్రారంభించిన జ‌గ‌న్

YS Jagan : ఏపీ ప్ర‌భుత్వం కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టింది. పేద‌లు, బ‌డుగు బ‌ల‌హీన‌, మైనార్టీ వ‌ర్గాల‌కు మేలు చేకూర్చాల‌ని య‌త్నిస్తోంది.

రోడ్ల ప‌క్క‌న తోపుడు బండ్ల‌పై పండ్లు, కూర‌గాయ‌లు అమ్ముకునే చిరు వ్యాపారులకు 5 ల‌క్ష‌ల 10 వేల 462 మందికి ప్ర‌భుత్వం రూ. 510.46 కోట్లు రూపాయ‌లు మంజూరు చేసింది.

న‌యా పైసా వ‌డ్డీ ఖ‌ర్చు లేకుండా రుణాల పంపిణీ కార్య‌క్ర‌మానికి ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(YS Jagan) శ్రీ‌కారం చుట్టారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడారు.

త‌మ‌కు తాము ఉపాధి క‌ల్పించడ‌మే గొప్ప విష‌య‌మ‌న్నారు. ల‌క్ష‌లాది మంది చిరు వ్యాపారులు స్వ‌యం ఉపాధి పొందుతున్నార‌ని చెప్పారు. ఈ రుణాల తోడ్పాటుతో వారి కాళ్ల మీద వారు నిల‌బ‌డేందుకు ఎంత‌గానో ఈ ప‌థ‌కం ఉప‌యోగ ప‌డుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

తాను ఎన్నిక‌ల సంద‌ర్భంగా చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో చిరు వ్యాపారుల క‌ష్టాలు స్వ‌యంగా చూశాన‌ని చెప్పారు. వారి క‌ళ్ల‌ల్లో క‌న్నీళ్లు లేకుండా చేసేందుకు, వారి కాళ్ల మీద వారు నిల‌బ‌డేలా చేసేందుకు రుణాలు మంజూరు చేశామ‌న్నారు.

ఇప్ప‌టి దాకా 14 ల‌క్ష‌ల మందికి తోడ్పాటు క‌ల్పించ‌డం వ‌ల్ల వారి ప‌రిస్థితులు బాగు ప‌డ్డాయ‌ని చెప్పారు జ‌గ‌న్ రెడ్డి(YS Jagan). మూడో విడ‌త కింద 5 ల‌క్ష‌ల 10 వేల 462 మంది చిన్న వ్యాపారుల‌కు ల‌బ్ది చేకూరుతుంద‌న్నారు.

పూర్తి వ‌డ్డీ భారాన్ని ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తూ ఒక్కొక్క‌రికి రూ. 10 వేల రుణం అంద‌జేస్తుంద‌ని తెలిపారు. వ‌డ్డీ రీఎంబ‌ర్స్ మెంట్ రూ. 16.16 కోట్లు క‌లిపి మొత్తం రూ. 526.62 కోట్లు సాయం జ‌రుగుతుంద‌న్నారు.

Also Read : ఆయ‌న సినిమాతో మాకేం ప‌ని

Leave A Reply

Your Email Id will not be published!