NV Ramana : మాతృ భాష‌ను మ‌రిచి పోవ‌ద్దు – ఎన్వీ ర‌మ‌ణ

తెలుగు అనేది భాష కాదు జీవ‌న విధానం

NV Ramana : మాతృ భాష‌ను మ‌రిచి పోవ‌ద్దంటూ భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ కోరారు. తెలుగు భాష అనేది కేవ‌లం భాష మాత్ర‌మే కాద‌ని అది జీవ‌న విధానమ‌ని పేర్కొన్నారు.

ప్ర‌తి రోజు విధిగా ఇంట్లో పిల్ల‌ల‌తో తెలుగ‌లోనే మాట్లాడాల‌ని సూచించారు. రోజు రోజుకు భాష ప‌ట్ల ఆస‌క్తి క‌న‌బర్చ‌డం లేద‌న్న ఆందోళ‌న క‌లుగుతోంద‌న్నారు.

అమెరికాలోని న్యూజెర్సీలో తెలుగు క‌మ్యూనిటీ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ(NV Ramana) పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. మాతృ భాష లో ఉన్న ప్రేమ‌ను ఆస్వాదించాలంటూ పిలుపునిచ్చారు. తెలుగుపై ప‌ట్టు సాధిస్తే మిగ‌తా భాష‌ల‌ను నేర్చు కోవ‌డం సులువ‌వుతుంద‌న్నారు.

తెలుగు భాష‌ను నేర్చుకుంటూనే ఇత‌ర భాష‌ల‌ను కూడా గౌర‌వించాల‌న్నారు. చాలా మందికి తెలుగులో చ‌దివితే ఉద్యోగాలు రావేమోన‌న్న ఆందోళ‌న ఉంద‌ని పేర్కొన్నారు.

కానీ తాను డిగ్రీ వ‌ర‌కు తెలుగు మాధ్య‌మంలోనే చ‌దివాన‌ని చెప్పారు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌(NV Ramana). ఇంట్లో విధిగా పెద్ద‌లు, పిల్ల‌లు తెలుగులోనే మాట్లాడాల‌ని సూచించారు.

మాతృ భాష‌లోనే చ‌దివి తాను ఈ స్థాయికి ఎదిగాన‌ని తెలిపారు. తెలుగు వారంద‌రినీ అమెరికాలో క‌ల‌వ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. ఎన్నో ఇక్క‌ట్ల‌ను ఎదుర్కొన్నాన‌ని పేర్కొన్నారు.

తాను రైతు కుటుంబం నుంచి వ‌చ్చాన‌ని, గ‌తంలో కంటే ప్ర‌స్తుతం ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెప్పారు సీజేఐ. యుఎస్ లో 7 ల‌క్ష‌ల మంది తెలుగు వారు ఉండ‌డం మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు.

మీరు చేస్తున్న కృషిని తాను ప్ర‌త్యేకంగా అభినందిస్తున్న‌ట్లు తెలిపారు.

Also Read : ర‌చ‌యిత్రి స‌జ‌య‌కు అరుదైన గౌర‌వం

Leave A Reply

Your Email Id will not be published!