Arvind Kejriwal: టపాసులతో కేజ్రీవాల్‌కు స్వాగతం: కేసు నమోదు చేసిన పోలీసులు
టపాసులతో కేజ్రీవాల్‌కు స్వాగతం: కేసు నమోదు చేసిన పోలీసులు
Arvind Kejriwal: జైలు నుంచి విడుదలైన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు టపాసులతో స్వాగతం పలికినందుకు గానూ పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం విధానానికి సంబంధించిన కేసు లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) నిన్న రాత్రి తిహాడ్ జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. సీఎంకు టపాసులతో స్వాగతం పలికారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాణసంచా వినియోగంపై దిల్లీలో నిషేధం ఉండటమే ఇందుక్కారణం..!
తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత దిల్లీ సివిల్ లైన్స్‌లో సీఎం నివాసం వెలుపల ఆప్ కార్యకర్తలు టపాసులు పేల్చారు. దీంతో పాటు దిల్లీలోని పలు ప్రాంతాల్లోనూ కార్యకర్తలు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. దీంతో భారతీయ న్యాయ సంహిత చట్టం కింద గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు.
Arvind Kejriwal – కేజ్రీవాల్ రీలీజ్
దేశ రాజధాని నగరంలో కాలుష్య నియంత్రణే లక్ష్యంగా బాణసంచా తయారీ, విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు గత సోమవారం దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిషేధం వచ్చే ఏడాది జనవరి 1 వరకు అమలులో ఉండనుంది. ఆన్‌లైన్‌లో విక్రయాలు, డెలివరీలకూ ఈ నిషేధం వర్తిస్తుందని దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు.
మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. దీంతో దాదాపు ఆరు నెలల తర్వాత ఆయన తిహాడ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కుట్రపై సత్యం విజయం సాధించిందని అన్నారు. దేశాన్ని బలహీన పరుస్తున్న, విభజిస్తున్న శక్తులపై తన పోరాటం ఆగదని పేర్కొన్నారు.
Also Read : Rain Alert: దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన: ఐఎండీ హెచ్చరిక!