Divorce Function in India:పెళ్ళి వేడుకకు ధీటుగా కుమార్తె విడాకుల ర్యాలీను నిర్వహించిన తండ్రి !
పెళ్ళి వేడుకకు ధీటుగా కుమార్తె విడాకుల ర్యాలీను నిర్వహించిన తండ్రి !
Divorce Function:భారతీయ సాంప్రదాయంలో పెళ్లికి ప్రత్యేకమైన స్థానం ఉంది. జీవితంలో ఒకేసారి చేసుకునే ఈ కార్యక్రమాన్ని… పెళ్ళికొడుకు, పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యుల ఆర్ధిక, సామాజిక స్థితుగతులను బట్టి అంగరంగ వైభంగా నిర్వహిస్తారు. ఒకప్పుడు ఆదర్శ వివాహాలు చేసుకునే వామపక్ష భావజాలం ఉన్నవారు కూడా…. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తమ హోదాకు తగ్గట్టుగా పెళ్లి వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే భారతీయ వివాహ వ్యవస్థలో ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో పెళ్లి ఘనంగా నిర్వహించినప్పటికీ… అనివార్య కారణాల వలన భార్యభర్తలు విడిపోవాల్సి వస్తే(Divorce) దీని ప్రభావం మహిళలపై తీవ్రంగా చూపిస్తుంది.
Divorce Function:
తన భార్యతో విడాకులు తీసుకున్న తరువాత పురుషుడు ఎటువంటి ఆలస్యం చేయకుండానే వేరొక పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతారు. అయితే తన భర్తతో విడాకులు తీసుకున్న మహిళ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో విడాకులు తీసుకుని కన్నవారికి భారం అయ్యేకంటే కష్టాలు, వేధింపులు తట్టుకుని కాపురాలు చేసేవారు కొందరుంటే… మరికొందరు అర్ధాంతరంగా తనువు చాలించే వారు మరికొందరు ఉంటున్నారు.
అయితే ప్రస్తుత సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంతో పురుషాధిక్య సమాజం నుండి ఇద్దరూ సమానులే అనే భావానికి వచ్చారు. దీనితో విడాకులు తీసుకున్న తరువాత తన స్వంత కాళ్ళపై నిలబడే ధైర్యం, తెగింపు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అయితే సమాజంలో పరువు ప్రతిష్టలకు తలొగ్గుతున్న తల్లిదండ్రులు మాత్రం విడాకులు(Divorce) తీసుకున్న తరువాత తమ కుమార్తెను చాలా సెన్సిటివ్ గా చూస్తుంటారు. అయితే ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో మాత్రం ఓ తండ్రి దీనికి విరుద్ధంగా వ్యవహరించారు. తమ కుమార్తెకు పెళ్లి చేసి ఎలా అయితే అత్తవారింటికి పంపించారో… అత్తింటి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న తరువాత మరల ఆమెను అదేవిధంగా ఇంటికి ఆహ్వానించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది.
ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పుర్ కు చెందిన అనిల్‌కుమార్ అనే ఓ వ్యక్తి ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఇంజినీర్ గా విధులు నిర్వహిస్తున్న తన కుమార్తె ఉర్వి(36)ని 2016లో ఢిల్లీకి చెందిన కంప్యూటర్ ఇంజినీర్ కు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. కొద్దికాలం తర్వాత వరకట్నం కోసం యువతిని అత్తమామలు, భర్త వేధించడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. ఎనిమిదేళ్లు హింసను భరించిన అనంతరం ఫిబ్రవరి 28న కోర్టు తీర్పు వెలువడింది. న్యాయస్థానం వారికి విడాకులు మంజూరు చేసింది.
దీనితో యువతిని ఆమె తండ్రి… అత్తవారి ఇంటి నుంచి బ్యాండ్‌మేళంతో ఊరేగింపుగా తమ ఇంటికి తీసుకెళ్లారు. ‘‘మేం మా కుమార్తెను పెళ్లి తర్వాత మెట్టినింటికి ఎలా పంపామో అలాగే పుట్టింటికి తెచ్చుకున్నాం. ఈ సంఘనటతో మా కుమార్తె, మనవరాలు నిరాశలో ఉండిపోకూడదని, నేటి నుంచి వారు కొత్త జీవితం ప్రారంభించాలని కోరుకున్నాం. అందుకే వారిని మేళతాళాలతో ఆనందంగా ఇంటికి ఆహ్వానించాం’’ అని అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. తన జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే ముందు కొంత సమయం తీసుకుంటానని ఉర్వి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
Also Read:-Telangana Lok Sabha Elections: తెలంగాణలో లోక్ సభ బరిలో 525 మంది అభ్యర్ధులు !