AAP WIN : దేశ రాజకీయాలను విస్మయ పరిచేలా ఆమ్ ఆద్మీ పార్టీ సంచలనం సృష్టించింది. భారతీయ జనతా పార్టీకి రాజధాని ఢిల్లీలో కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చిన ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఈసారి పంజాబ్ రాష్ట్రంలో పాగా వేశారు.
ఏక్ మౌకా కేజ్రీవాల్ ఏక్ మౌకా భగవంత్ మాన్ కో దేదో అంటూ ఇచ్చిన నినాదం పంజాబ్ లో చరిత్ర సృష్టించేలా చేసింది. సామాన్యుల పార్టీగా చెప్పుకుంటూ వచ్చిన ఆప్ ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఊహించని రీతిలో స్థానాలను చేజిక్కించుకుంది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఆప్(AAP WIN) విజయాలు సాధించడం పాలకుల పనితీరుపై ప్రజల ఆగ్రహాన్ని తెలియ చేస్తుంది. మొత్తం 117 సీట్లు పంజాబ్ లో ఉండగా కడపటి వార్తలు అందేసరికి మొత్తం 92 స్థానాలను కైవసం చేసుకుంది.
మళ్లీ అధికారంలోకి రావాలని అనుకున్న కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించింది. ఏకంగా ఆ పార్టీ 18 సీట్లకే పరిమితమైంది. ఇక బీరాలు పలికిన సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మాజీ సీఎం కెప్టన్ అమరందర్ సింగ్ కంచు కోట పాటియాలను బద్దలు కొట్టింది ఆప్.
అంతేనా పంజాబ్ లోని అతిరథ మహారథులను మట్టి కరిపించింది. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ నవ జ్యోత్ సింగ్ సిద్దూ , సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ, అకాలీదళ్ సీనియర్ నాయకుడు బిక్రం సింగ్ మజిథియా, ప్రకాశ్ సింగ్ బాదల్ ఇలా చెప్పుకుంటూ పోతే బిగ్ లీడర్లంతా ఇంటి బాట పట్టారు.
గత కొంత కాలంగా కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన శిరోమణి అకాలీదళ్ పార్టీ 4 సీట్లకే పరిమితమైంది. బీజేపీ 2 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. ఇక ఒక స్థానంలో ఇతరులు గెలుపొందారు. మొత్తంగా ఆప్ సునామీ దెబ్బకు అంతా ఠారెత్తారు.
Also Read : కేజ్రీవాల్ ఉగ్రవాది కాదు దేశ భక్తుడు