Adani Scam Comment : అదానీ చ‌ట్టానికి అతీతుడా

ఆరోప‌ణ‌ల‌పై నోరు మెద‌ప‌ని పీఎం

Adani Scam Comment : అదానీ గ్రూప్ త‌ల్ల‌డిల్లుతోంది. కానీ ఆ సంస్థ‌ల చైర్మ‌న్ గౌత‌మ్ అదానీ మాత్రం మౌనంగా ఉన్నారు. కేవ‌లం రాహుల్ గాంధీ వ‌ల్ల త‌న పేరు ప్ర‌పంచానికి తెలిసిందంటూ న‌ర్మగ‌ర్భంగా ప్ర‌క‌టించారు. ప్ర‌పంచ కుబేరుల జాబితాలో టాప్ లో ఉన్న అదానీ ఉన్న‌ట్టుండి ప‌డి పోతూనే ఉన్నాడు. 

ఇదంతా ప‌క్క‌న పెడితే ఎందుక‌ని ఇంత‌గా చ‌ర్చ జ‌రుగుతోంది. దేశానికి దిశా నిర్దేశం చేసి చ‌ట్టాలు చేసే పార్ల‌మెంట్ స్తంభించి పోయింది. చిన్న త‌ప్పు చేస్తే ఎఫ్ఐఆర్ చేసే ఈ దేశంలో , కించిత్ ఆరోప‌ణ‌లు వ‌స్తే చాలు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు సీబీఐ, ఈడీ, ఐటీ దాడుల‌కు పాల్ప‌డేవి. 

కానీ ఇవేవీ నోరు మెద‌ప‌డం లేదు. కేసులు న‌మోదు చేయ‌డం లేదు. విచిత్రం ఏమిటంటే ఈ దేశంలోని ప్ర‌తి ఒక్క‌రు పన్ను చెల్లిస్తున్నారు..కానీ అదానీ గ్రూప్ దీనికి అతీతం కాదు. కానీ ఎందుక‌ని ప్ర‌భుత్వం మౌనంగా ఉంటోంది. అదానీ వ‌ల్ల దేశానికి ఏమైనా లాభం క‌లిగిందా. 

లేక ఆయ‌న వ‌ల్ల ఎంత మేర‌కు దేశానికి మేలు చేకూరిందా. ప్ర‌స్తుతం ప్ర‌పంచమంతా అమెరికా రీసెర్చ్ కంపెనీ హిండెన్ బ‌ర్గ్ గురించి చ‌ర్చిస్తోంది. కానీ అంత‌కంటే ముందు భార‌త దేశానికి చెందిన ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ సుచేతా ద‌లాల్ అదానీ చేస్తున్న మోసం(Adani Scam) గురించి కుండ బ‌ద్ద‌లు కొట్టింది. 

ఆమెను ప‌ట్టించు కోలేదు. కానీ రీసెర్చ్ గ్రూప్ ఫౌండ‌ర్ ఆండ‌ర్స‌న్ కొట్టిన దెబ్బ‌కు ఊహించ‌ని షాక్ కు గుర‌య్యాడు గౌత‌మ్ అదానీ. ఎందుక‌ని కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం వెన‌కేసుకు వ‌స్తోంది.

ఎందుక‌ని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని అన్ని బ్యాంకుల‌ను అదానీ తీసుకున్న రుణాల వివ‌రాల‌ను ఇవ్వాల‌ని ఆదేశించింది. ప్ర‌భుత్వ బ్యాంకులు ల‌క్ష రూపాయ‌ల లోను కావాలంటే స‌వాల‌క్ష రూల్స్ విధిస్తాయి.

కానీ ఎందుక‌ని ఆర్థిక నేర‌గాళ్ల విష‌యంలో చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌నేది ఆలోచించాలి. ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీని మ‌నీ లాండ‌రింగ్ కేసులో విచార‌ణ‌కు పిలిపించిన ఈడీ ఎందుక‌ని గౌత‌మ్ అదానీని ముట్టు కోవ‌డం లేద‌ని సామాన్యుడు ప్ర‌శ్నిస్తున్నాడు. అదానీ దేశ‌మంతా విస్త‌రించాడు..ప్రపంచాన్ని ప్ర‌భావితం చేసేలా చేశాడు. 

లెక్క‌కు మించి అప్పులు చేశాడు. విచిత్రం ఏమిటంటే ప్ర‌స్తుతం అదానీ గ్రూపుకు ఉన్న ఆస్తుల విలువ కంటే చేసిన రుణాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గ‌తంలో గౌతమ్ అదానీ పేరు దేశంలో కొద్దిమందికి మాత్ర‌మే తెలుసు. 

కానీ 2014లో ఎప్పుడైతే న‌రేంద్ర మోదీ ప్ర‌ధాన‌మంత్రిగా కొలువు తీరారో ఆనాటి నుంచీ అంచెలంచెలుగా లోక‌మంతా తెలిసేలా చేసింది. ఈ ప్ర‌చారం వెనుక ఎవ‌రున్నారో..బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.

అదానీ గ్రూప్ మౌలిక స‌దుపాయ‌లు, ఇంధ‌నం, మైనింగ్ , రక్ష‌ణ , లాజిస్టిక్ , విమాన‌యానం, ఓడ రేవులు, స్పోర్ట్స్ ..ఇలా ప్ర‌తి రంగంలో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌స్తోంది.  

బిలియ‌న్ల ఆదాయం వ‌చ్చినా దాని వెనుక లెక్క‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు ఉన్నాయ‌ని, అమాంతం ఎలా పెరుగుతుంద‌ని హిండెన్ బ‌ర్గ్ ప్ర‌శ్నించింది. కంపెనీల‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చినప్పుడు సెబీ స్పందించాల్సి ఉంటుంది. 

అది ప‌ల‌క‌డం లేదు. విచిత్రం ఏమిటంటే కోట్లాది మంది క‌ష్ట‌ప‌డి దాచుకున్న సంస్థ ఎల్ఐసీ, ఎస్బీఐ లు ఉన్న‌ట్టుండి అదానీ గ్రూపులో(Adani Group) ఇన్వెస్ట్ చేశాయి. వీటికి ఢోకా లేదంటోంది విత్త మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్

ఇదిలా ఉండ‌గా సుచేతా ద‌లాల్ భార‌త దేశంలోని ప్ర‌సిద్ద వ్యాపార జ‌ర్న‌లిస్టుల‌లో ఒక‌రిగా గుర్తింపు పొందారు. 1992లో హ‌ర్ష‌ద్ మెహ‌తా స్కాం ను బ‌య‌ట పెట్టారు. సంచ‌ల‌నంగా మారారు.

ఇదే ద‌లాల్ అదానీ స్కాంకు ఎలా పాల్ప‌డుతున్నాడో (Adani Scam) స్ప‌ష్టం చేసింది.  ఏది ఏమైనా అదానీ ఏమైనా దేశానికి అతీతుడా అన్న‌ది చెప్పాల్సింది కేంద్ర ప్ర‌భుత్వ‌మే. 

మ‌రి నిత్యం మ‌న్ కీ బాత్ అంటూ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగిస్తుంటే గౌతం అదానీ గురించి ఎందుకు ప్ర‌స్తావించ‌డం లేద‌న్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

Also Read : అదానీపై విచార‌ణ చేప‌ట్టాలి – కాంగ్రెస్

Leave A Reply

Your Email Id will not be published!