Ahmed Basha: మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు అహ్మద్ బాషాకు 14 రోజుల రిమాండ్
మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు అహ్మద్ బాషాకు 14 రోజుల రిమాండ్
వైసీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను కడప పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయిన అహ్మద్ బాషా… ఇటీవల రంజాన్ పండుగ కోసం కడపకు వచ్చారు. అయితే అతనిపై నమోదైన పలు కేసుల్లో ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో… కువైట్ వెళ్తుండగా ముంబై ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్ట్ చేసారు. అనంతరం కడప కోర్టులో సోమవారం ప్రవేశపెట్టారు. దీనితో కడప కోర్టు అహ్మద్ బాషాకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 21 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనితో అతడ్ని పోలీసులు కడప జైలుకు తరలించారు.
ఇవాళ ఉదయం సుమారు 8 గంటలపాటు డీటీసీలో అహ్మద్ బాషాను విచారించిన పోలీసులు… అక్కడి నుంచి తొలుత అతడిని రిమ్స్ కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కడప రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరు పరిచారు. అహ్మద్ బాషాను పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కువైట్ కు వెళ్లేందుకు ముంబయి విమానాశ్రయానికి చేరుకున్న ఆయన్ను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని, కడప పోలీసులకు అప్పగించారు.
2022లో కడప వినాయకనగర్ లో తలెత్తిన ఓ స్థల వివాదంలో జరిగిన ఘర్షణలో ముస్తాక్ అహ్మద్ అనే వ్యక్తిపై అహ్మద్ బాషా తన అనుచరులతో కలిసి దాడి చేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించగా… ఆయనపై వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనను అరెస్టు చేస్తారన్న భయంతో అహ్మద్ బాషా దుబాయ్ లో తలదాచుకుంటున్నారు. రంజాన్ నేపథ్యంలో ఇటీవల కడపకు వచ్చారు. శనివారం రాత్రి తిరిగి వెళ్లేందుకు ముంబయి విమానాశ్రయానికి చేరుకోగా… అప్పటికే ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో అదుపులోకి తీసుకున్నారు.