Air India Insurance: అహ్మదాబాద్ లో కూలిన విమానానికి రూ.4,000 కోట్లకు పైగా ఇన్సూరెన్స్ ?

అహ్మదాబాద్ లో కూలిన విమానానికి రూ.4,000 కోట్లకు పైగా ఇన్సూరెన్స్ ?

Air India : అహ్మదాబాద్‌ లో జూన్‌ 12న ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌ ఏఐ 171 దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విమానం కుడివైపునున్న ఇంజిన్‌ ను మూడు నెలల క్రితమే ఓవర్‌ హాలింగ్‌ సమయంలో అమర్చినట్లు గుర్తించారు. ఈ బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ దాదాపు 12 ఏళ్ల నుంచి వాడుకలో ఉంది. చివరిసారిగా దీనికి జూన్‌ 2023లో మెయింటెనెన్స్‌ చేశారు. డిసెంబర్‌ 2025న మరోసారి దీనిని నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రమాదానికి గురైన ఎయిర్‌ ఇండియా (Air India) బోయింగ్ డ్రీమ్‌ లైనర్‌ ఇన్స్యూరెన్స్‌ కవర్‌ను సంస్థ రూ.750 కోట్ల నుంచి రూ.850 కోట్లకు పెంచింది. ఇటీవలే ఇంజిన్‌ రీప్లేస్‌ చేయడంతో ఈ నిర్ణయం తీసుకొంది.

Air India Insurance Claim

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా (Air India) విమాన ప్రమాదం దశాబ్దకాలంలో ఎన్నడూ చూడనంత పెద్దది. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం ద్వారా బీమా కంపెనీలు చెల్లించాల్సిన క్లెయిమ్‌ల మొత్తం కూడా అంతే భారీగా ఉండబోతోంది. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన క్లెయిమ్‌లలో ఒకటిగా నిలువబోతోంది. ఇక నాన్‌లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ దిగ్గజం జనరల్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా మొత్తం క్లెయిమ్‌లు 475 మిలియన్‌ లేదా ₹39.4 బిలియన్లు(సుమారు రూ. 4వేల కోట్లు)గా అంచనా వేస్తున్నారు. వీటిల్లో ప్రమాదం కారణంగా ఎయిర్‌ ఇండియా చెల్లించాల్సిన పరిహారం, నష్టాల చెల్లింపులు వంటివి కూడా చేరి విమానం ఖరీదు కంటే 2.5 రెట్లు అధికం కానున్నాయి. దీనితో ఈ మొత్తం 475 మిలియన్‌ డాలర్ల (రూ.4,091 కోట్లు)కు చేరింది. విమానం నష్టానికి 125 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సిఉండగా… ప్రయాణికుల కుటుంబాలకు, థర్డ్‌పార్టీ, ఇతర వ్యక్తులకు జరిగిన నష్టాలకు, ట్రావెల్‌ పాలసీలు మొత్తం కలిపి మరో 350 మిలియన్‌ డాలర్ల అవుతాయి అంచనా.

జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రామస్వామి నారాయణన్ ఈ క్లెయిమ్ మీద స్పందించారు. ‘ఈ ఏవియేషన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ భారతదేశ చరిత్రలో అతిపెద్ద వాటిలో ఒకటి కావచ్చు’ అని ఆయన అన్నారు. ఇక, క్లెయిమ్‌ల చెల్లింపుల విషయానికొస్తే మొదట బీమాదారుల హల్ క్లెయిమ్‌ను పరిష్కరిస్తారు. తరువాత ఇతర క్లెయిమ్‌ల వంతు. అయితే, వీటన్నింటిని పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందని నారాయణన్ చెప్పారు. నారాయణన్ చెబుతున్నదాని ప్రకారం, విమాన హల్(విమానంలోని కీలకమైన అన్ని భాగాలు), ఇంజిన్ కోసం క్లెయిమ్ దాదాపు $125 మిలియన్లు లేదా ₹10.44 బిలియన్లుగా అంచనా వేస్తున్నారు. ప్రయాణీకులు, ఇతరుల ప్రాణనష్టానికి అదనపు బాధ్యత క్లెయిమ్‌లు దాదాపు $350 మిలియన్లు లేదా ₹29.23 బిలియన్లు ఉంటుందని లెక్కకడుతున్నారు. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం 2023లో భారతదేశంలో విమానయాన పరిశ్రమ చెల్లించిన వార్షిక ప్రీమియం కంటే ఈ క్లెయిమ్ మూడు రెట్లు ఎక్కువ.

ఈ పరిస్థితుల్లో ఇన్స్యూరెన్స్ కంపెనీలు భారీగా క్లెయిమ్స్ చెల్లించి రావడంతో ఇది మొత్తం ప్రపంచ విమానయాన పునఃభీమా మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని బ్లూమ్‌బెర్గ్ నివేదికలు చెబుతున్నాయి. ఇది భారతదేశంలోని విమానయాన సంస్థలకు బీమాను మరింత ఖరీదైనదిగా చేసే అవకాశం ఉందని సదరు సంస్థ అంటోంది. విమానయాన పరిశ్రమ అంతటా బీమా ప్రీమియంలు తక్షణం లేదా పాలసీ పునరుద్ధరణ సమయంలో పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఎయిర్ ఇండియాకు కవరేజ్ అందించిన సంస్థలలో జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒకటి.

Also Read : Air India: ఇండోనేసియాలో బద్దలైన అగ్నిపర్వతం ! వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం !

Leave A Reply

Your Email Id will not be published!