Air India: ‘పాన్‌-పాన్‌’ సిగ్నల్‌ తో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

‘పాన్‌-పాన్‌’ సిగ్నల్‌ తో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Air India : దిల్లీ నుంచి ఇండోర్‌ బయలుదేరిన ఎయిరిండియా (Air India) ఎక్స్‌ప్రెస్‌ విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించిన పైలట్‌… ‘పాన్‌-పాన్‌’ కాల్‌ తో స్థానిక ఏటీసీని అప్రమత్తం చేశారు. చివరకు విమానం సురక్షితంగా ల్యాండింగ్‌ కావడంతో సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో విమానంలో 161 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

దిల్లీ నుంచి ఎయిరిండియా (Air India) ఎక్స్‌ప్రెస్‌ IX 1028 విమానం.. 161 ప్రయాణికులతో ఇండోర్‌ కు బయలుదేరింది. గాల్లో ఉండగానే ఓ ఇంజిన్‌ ఆయిల్‌ ఫిల్టర్‌ లో సమస్య ఉన్నట్లు పైలట్‌ గుర్తించారు. వెంటనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు పాన్‌-పాన్‌ (PAN-PAN) సిగ్నల్‌ ఇచ్చారు. దీనితో ఎయిర్ ఇండియా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్ కు అనుగుణంగా గ్రౌండ్‌ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. 20 నిమిషాల ఆలస్యమైనప్పటికీ… చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. సమస్య గురించి తెలియగానే అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచామని ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ వెల్లడించింది. ఇటువంటి సవాళ్లను ఎదుర్కోవడంలో తమ పైలట్లు ఉత్తమ శిక్షణ కలిగి ఉన్నారని తెలిపింది.

Air India – అసలేమిటీ ఈ ‘పాన్‌-పాన్‌’ సిగ్నల్‌ ?

పాన్‌-పాన్‌ సిగ్నల్‌ అనేది సముద్రయానం, వైమానిక కమ్యూనికేషన్‌ వ్యవస్థలో భాగం. ఇదో ఎమర్జెన్సీ సందేశం. విమానయానంలో ఇది అత్యవసర పరిస్థితిని సూచించినప్పటికీ.. మేడే (MAYDAY) సిగ్నల్‌ అంత తీవ్ర పరిస్థితి కాదు. ప్రయాణికులకు, సిబ్బందికి ప్రాణాపాయ స్థితి లేకున్నా… సాయం కావాలని విజ్ఞప్తి చేసే ఓ సందేశం. పైలట్‌ ‘పాన్‌-పాన్‌’ సిగ్నల్‌ ఇచ్చారంటే… ఏటీసీ లేదా గ్రౌండ్‌ సర్వీసు నుంచి తక్షణ సాయం అవసరమని అర్థం. పైలట్‌ నుంచి అందుకున్న వెంటనే అంబులెన్సులు, అగ్నిమాపక బృందాలతో క్షేత్రస్థాయి సిబ్బంది రన్‌వే సమీపంలో మోహరిస్తారు. అత్యవసర పరిస్థితికి అనుగుణంగా స్పందిస్తారు.

స్పై కెమెరాతో మహిళల వీడియోలు రికార్డు చేసిన పైలట్‌ అరెస్ట్‌

బహిరంగ ప్రదేశాలలో అభ్యంతరకరంగా మహిళల వీడియోలు రికార్డు చేస్తున్న పైలట్‌ ను పోలీసులు అరెస్టు చేసిన ఘటన దిల్లీలో చోటు చేసుకుంది. దీంతో బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రతపై ఆందోళన నెలకొంది. ఇటీవల దిల్లీ కిషన్‌గఢ్‌లోని శని బజార్‌ లో ఓ వ్యక్తి స్పై కెమెరాతో మహిళల వీడియోలు చిత్రీకరిస్తుండడాన్ని ఓ మహిళ గుర్తించింది. లైటర్‌ ఆకారంలో ఉన్న స్పై కెమెరాతో మహిళలను అభ్యంతరకరంగా చిత్రీకరిస్తుండడంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. కొద్ది సేపటికి పోలీసులు అక్కడికి చేరుకోగా… అతడు పరారయ్యాడు.

మార్కెట్‌లోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన మోహిత్ ప్రియదర్శిగా గుర్తించారు. నిందితుడు ఓ ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌ గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి నుంచి మహిళల అభ్యంతరకర వీడియోలు ఉన్న స్పై కెమెరాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడు పలు బహిరంగ ప్రదేశాలలో మహిళలను అసభ్యకరంగా చిత్రీకరిస్తున్నట్లు గుర్తించామన్నారు. కేసు నమోదు చేసి.. వీడియోలను మరెవరికైనా షేర్‌ చేశాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Also Read : Prisoners: చోడవరం సబ్‌ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారీ

Leave A Reply

Your Email Id will not be published!