Air India : హడలెత్తిస్తున్న ఎయిరిండియా విమానాలు
హడలెత్తిస్తున్న ఎయిరిండియా విమానాలు
Air India : అహ్మదాబాద్ లో నాలుగు రోజుల క్రితం జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం… యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. దీనితో విమానం ప్రయాణం అంటే చాలు ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. దీనికి తోడు శని, ఆదివారాల్లో అదే సంస్థకు చెందిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాల్లో సమస్యలు తలెత్తి సహనాన్ని పరీక్షించాయి. అయితే ఈ రెండూ ఎయిరిండియా విమానాలు కూడా కోల్‌కతాకు వెళ్లాల్సినవే.
గువాహటి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్‌కతాకు 170 మంది ప్రయాణికులతో వెళ్లాల్సిన ఐఎక్స్-1226 విమానం శనివారం రాత్రి 9.20 గంటలకు బయల్దేరాలి. సాంకేతిక సమస్య పేరుతో అది ఆలస్యమైంది. సమస్య ఏమిటో, విమానం ఎప్పుడు బయల్దేరుతుందో తెలియక ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. దానిపై పలు వీడియోలు క్షణాల్లో చక్కర్లు కొట్టాయి. అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో వారిని విమానం దిగాలని చెప్పి ఒక హోటల్ కు తరలించారు. ఆదివారం ఉదయం 9.30కి మళ్లీ విమానం ఎక్కించారు. అదే సాంకేతిక సమస్య వల్ల విమానం ఆలస్యమవుతోందని మరోసారి ప్రకటించారు. రెండోసారి కిందికి దించి, విమానాశ్రయంలోకి తరలించారు. వేరే విమానం ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. చివరకు అలా మరో విమానంలో సాయంత్రం 3.34 గంటలకు వారు బయల్దేరారు. కొందరు మాత్రం వేరే విమానాలను ఎంచుకున్నారు.
Air India – రన్‌వేపైనే గంటసేపు నిరీక్షణ
ఆదివారం ఉదయం 7 గంటలకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని (Uttar Pradesh) గాజియాబాద్ నుంచి బయల్దేరి 9.20కి కోల్‌కతాకు చేరాల్సిన ఎయిరిండియా (Air India) ఎక్స్‌ప్రెస్ విమానం (ఐఎక్స్ 1511)లోనూ సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్‌కు ముందు దీనిని గుర్తించిన సంస్థ అప్రమత్తమై ప్రయాణాన్ని నిలిపివేసింది. దీనితో ప్రయాణీకులు రన్‌వేపైనే గంటసేపు ఉండాల్సి వచ్చింది. ప్రయాణం 7 గంటలు ఆలస్యమవుతుందని, ప్రయాణికులకు కావాలంటే టికెట్ సొమ్ము వాపసు చేస్తామని సంస్థ వెల్లడించి తాత్కాలిక ఏర్పాట్లు చేసింది. లోపాన్ని సరిచేశాక మధ్యాహ్నం 2.09 గంటలకు ఇది బయల్దేరి సాయంత్రం 4.24 గంటలకు గమ్యాన్ని చేరుకుంది.
మరోవైపు లండన్ నుంచి చెన్నైకి బయల్దేరిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో సమస్య తలెత్తడంతో అర్థంతరంగా తిరిగి లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి మళ్లించారు.
మరో డ్రీమ్‌లైనర్ విమానంలో సాంకేతిక లోపం
ఎయిరిండియాకు (Air India) చెందిన బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఘటన మరవకముందే.. మరో విమానంలో సాంకేతికలోపం ప్రయాణికులను కలవరపాటుకు గురిచేసింది. హాంకాంగ్ నుంచి దిల్లీ వస్తోన్న ఎయిరిండియా విమానంలో ఈ సమస్యను గుర్తించడంతో దాన్ని వెనక్కి మళ్లించారు.
ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం ఏఐ315 విమానం సోమవారం ఉదయం హాంకాంగ్ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. మధ్యాహ్నం 12.20 గంటలకు ఇది దిల్లీలో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా… మార్గమధ్యంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ ఇన్ కమాండ్ గుర్తించారు. దీనితో అప్రమ్తతమైన పైలట్లు ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని వెనక్కి మళ్లించారు. అదృష్టవశాత్తూ ఈ విమానం హాంకాంగ్ ఎయిర్‌పోర్టులోనే సురక్షితంగా దిగింది. ప్రయాణికులందరినీ దించేసి విమానంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.
Also Read : Teacher Kidnap: ఆస్తి కోసం కన్నకూతురినే కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు
