Air India: భారత సాయుధ దళాల సిబ్బందికి ఎయిర్ ఇండియా తోడ్పాటు
భారత సాయుధ దళాల సిబ్బందికి ఎయిర్ ఇండియా తోడ్పాటు
పహాల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్ తో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సెలవులు రద్దు చేసుకుని విధులకు వస్తున్న భారత సాయుధ దళాల సిబ్బందికి తోడ్పాటు అందించేందుకు ఎయిర్ ఇండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థలు ముందుకు వచ్చాయి. ప్రయాణాల కోసం తమ వద్ద టికెట్లు బుకింగ్ చేసుకున్న ఆర్మీ సిబ్బంది టికెట్లను రద్దు చేసుకుంటే ఉచిత రీషెడ్యూల్ లేదా పూర్తి రీఫండ్స్ అందించనున్నట్లు ప్రకటించాయి.
పహల్గాం ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత సాయుధ దళాలు బుధవారం ఉదయం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై మిస్సైల్ దాడులు జరిపింది. భారత్ జరిపిన ఈ మెరుపు దాడిలో దాదాపు 90 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు మరణించారు. 60 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పారా మిలటరీ బలగాల సెలవులన్నింటినీ రద్దు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. సెలవులో ఉన్న బలగాలను వెంటనే విధులకు రప్పించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ సహా అన్ని పారామిలిటరీ బలగాలు తక్షణమే విధులకు హాజరు కావాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆర్మీ సిబ్బంది ఇప్పటికే బుక్ చేసుకున్న విమాన టికెట్లను ఎటువంటి అదనపు రుసుములు లేకుండా రద్దు చేసుకునేందుకు, రీ షెడ్యూల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది.
“ప్రస్తుత పరిస్థితుల్లో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాలలో డిఫెన్స్ కోటా కింద 2025 మే 31 వరకు టికెట్లు బుక్ చేసుకున్న సిబ్బందికి తమ డ్యూటీ కమిట్మెంట్లకు మద్దతుగా 2025 జూన్ 30 వరకు విమానాలను రీషెడ్యూల్ చేయడంపై పూర్తి రీఫండ్, వన్ టైమ్ మినహాయింపును అందిస్తున్నాం” అని ఎయిరిండియా ఒక పోస్ట్‌లో తెలిపింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా ఇలాంటి పోస్ట్ ను షేర్ చేసింది.