Air India: అమెరికా నుంచి భారత్ కు ‘గోల్డెన్‌ చాసిస్‌’

అమెరికా నుంచి భారత్ కు ‘గోల్డెన్‌ చాసిస్‌’

Air India : అహ్మదాబాద్‌ లో జూన్‌ 12న జరిగిన ఎయిర్‌ ఇండియా (Air India) ఏఐ 171 విమాన ప్రమాద దర్యాప్తులో ఓ పరికరం కీలక పాత్ర పోషించింది. దీనిని అమెరికా నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చారు. దాని పేరు గోల్డెన్‌ చాసిస్‌. డేటా సేకరణలో ఇది అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ప్రమాదానికి గురైన బోయింగ్‌ 787-8 డ్రీమ్‌ లైనర్‌కు సంబంధించిన బ్లాక్‌బాక్స్‌ను అధికారులు వేగంగానే కనుగొన్నా… దాని నుంచి డేటాను డౌన్‌లోడ్‌ చేయడం కత్తిమీద సాముగా మారింది. ప్రమాద సమయంలో వెలువడిన తీవ్రమైన వేడి కారణంగా అది దెబ్బతింది. ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరోలోని సంప్రదాయ ల్యాబ్‌లో దీని నుంచి డేటా డౌన్‌లోడ్‌ సాధ్యం కాలేదు. దీనితో యునైటెడ్‌ స్టేట్స్‌ నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డు వినియోగించే గోల్డెన్‌ చాసిస్‌ అనే ప్రత్యేక పరికరాన్ని రప్పించారు.

Air India ‘Golden Chasis’

ఇది దెబ్బతిన్న ఫ్లైట్‌ రికార్డర్స్‌ నుంచి కూడా డేటాను సేకరించగలదు. అవి తీవ్రంగా దెబ్బతిన్న సమయంలో వాటి క్రాష్‌ ప్రొటెక్షన్‌ మాడ్యూల్‌ను తొలగించి… గోల్డెన్‌ చాసిస్‌పై దానిని అమరుస్తారు. దీనితో ఫ్లైట్‌, కాక్‌పీట్‌ వాయిస్‌ డేటాను డౌన్‌లోడ్‌ చేసుకోవడం సాధ్యమవుతుంది. తాజాగా దర్యాప్తులో కూడా గోల్డెన్‌ చాసిస్‌, కేబుల్స్‌ను అమెరికాలోని ఎన్‌టీఎస్‌బీ నుంచి ప్రత్యేకంగా తెప్పించి వాడారు. దీనితో ఏఐ 171కు సంబంధించి గత ఆరు ప్రయాణాల డేటా డౌన్‌లోడ్‌ అయింది. వీటిల్లో ప్రమాదం జరిగినప్పటిది కూడా ఉంది. ఇది మొత్తం 49 గంటల ఫ్లైట్‌ డేటాను డౌన్‌లోడ్‌ చేయడానికి సాయం చేసింది.

అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్తున్న ఎయిరిండియా (Air India) బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ జూన్‌ 12వ తేదీన టేకాఫ్‌ అయిన వెంటనే కూలిపోయిన సంగతి తెలిసిందే. అందులోని ఒక్కరు మినహా ప్రయాణికులు, సిబ్బంది కలిపి 241 మంది మరణించారు. వారితోపాటు విమానం ఆసుపత్రి హాస్టల్‌పై కూలిపోవడంతో 29 మంది మృతి చెందారు. రెండు ఇంజిన్లకు రెప్పపాటు (సెకను) వ్యవధిలో ఇంధన సరఫరా నిలిచిపోవడంవల్లే అహ్మదాబాద్‌లో ఎయిరిండియాకు చెందిన ఏఐ171 విమానం కూలిపోయిందని ప్రాథమిక దర్యాప్తు నివేదిక తేల్చింది. ఇంధన సరఫరాను ఎందుకు ఆపావని ఒక పైలట్‌ ప్రశ్నించగా… తాను ఆపలేదని మరో పైలట్‌ సమాధానమివ్వడం కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌లో నమోదైందని తెలిపింది.

Also Read : Indian Railways: రైల్వేశాఖ కీలక నిర్ణయం ! త్వరలో అన్ని కోచ్‌లకు సీసీకెమెరాలు !

Leave A Reply

Your Email Id will not be published!