Air India: ఎయిరిండియా నిర్వాకంతో ఐసీయూలో చేరిన వృద్ధురాలు ?

ఎయిరిండియా నిర్వాకంతో ఐసీయూలో చేరిన వృద్ధురాలు ?

Air India : ఎయిరిండియా విమానయాన సంస్థ నిర్వాకం ఓ వృద్ధురాలిని ఆసుపత్రి పాలు చేసింది. ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో ఓ వృద్ధురాలికి వీల్‌ఛైర్‌ సేవలు నిరాకరించడంతో ఆమె కిందపడి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందుతుండగా… ‘తప్పనిసరి పరిస్థితుల్లో..’ అంటూ ఆమె మనవరాలు జరిగిందంతా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఎయిర్ ఇండియా సిబ్బంది నిర్లక్ష్యాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమె తీవ్ర ఎండగట్టడంతో… దెబ్బకు ఎయిరిండియా(Air India) దిగొచ్చింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Air India Negligence

మాజీ సైనికాధికారి భార్య రాజ్‌ పశ్రీచా(82)… తన కుటుంబ సభ్యులతో ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లడానికి ఎయిరిండియా విమానంలో టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. వృద్ధాప్య సమస్యలతో ఉన్న ఆమెకు వీల్‌ఛైర్‌ కోసం బుక్‌ చేసుకోగా… అది కన్ఫర్మ్‌ అయ్యింది. అయితే గంటసేపైనా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎవరూ పట్టించుకోలేదు. దీనితో ఆమె కౌంటర్ వద్దకు వెళ్ళేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల సాయంతో ముందుకు వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే ఈ ప్రయంత్నంలో ఆమె కాలు జారి కిందపడి గాయపడ్డారు. ఈ ఘటనలో ఆమె తలకు గాయం కాగా… ముక్కు, నోటి నుంచి రక్తం కారింది. అయితే ఆ టైంలోనూ సిబ్బంది ఎవరూ సాయానికి ముందుకు రాలేదని, తామే మెడికల్‌ కిట్‌ కొనుక్కొచ్చి ఫస్ట్‌ ఎయిడ్‌ చేశామని మనవరాలు పరుల్‌ కన్వర్‌ ఆరోపిస్తున్నారు. ఆపై కాసేపటికి వీల్‌ఛైర్‌ వచ్చిందని… గాయాలతోనే ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చామని తెలిపారు.

అయితే… ఈ మధ్యలో విమాన సిబ్బంది సాయం కోరగా… బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఆమెకు వైద్య సేవలు అందాయని, తలకు రెండు కుట్లు పడ్డాయని తెలిపారామె. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతుండగా… ఎడమ వైపు భాగానికి పక్షవాతం సోకిందని, మెదడులో రక్తస్రావం జరిగిందేమోననే అనుమానాలను వైద్యులు వ్యక్తం చేశారని పరుల్‌ తెలిపారు. ఈ ఘటనను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఆమె… మనిషి జీవితానికి కొంచెమైనా విలువ ఇవ్వండి అంటూ ఎయిరిండియా(Air India) సిబ్బందిని ఉద్దేశించి పోస్ట్‌ చేశారు. ఈ ఘటనపై డైరెక్టోరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌, ఎయిరిండియాలకు ఫిర్యాదు చేశామని, చర్యలకు కోసం ఎదురు చూస్తున్నామని ఆమె తెలిపారు.

అయితే పరుల్‌ పోస్టుపై ఎయిరిండియా స్పందించింది. ఆమె సోషల్‌ మీడియా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నామని బాధితురాలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఫోన్‌ నెంబర్‌, పూర్తి వివరాలను తమకు అందించాలని ఎయిరిండియా ఆమెను కోరింది. అయితే ఘటనపై దర్యాప్తు పూర్తైతేగానీ తాను ఎయిరిండియాతో సంప్రదింపులు జరపబోనని ఆమె స్పష్టం చేసారు.

Also Read : Nara Lokesh: ఆరోగ్యం జాగ్రత్త అంటూ మంత్రి నిమ్మలకు నారా లోకేశ్ స్వీట్ వార్నింగ్

Leave A Reply

Your Email Id will not be published!