Air India: విమానం ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్ ఇండియా పైలట్ మృతి
విమానం ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్ ఇండియా పైలట్ మృతి
Air India : ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియాలో పనిచేస్తోన్న 28ఏళ్ల పైలట్ గుండెపోటుతో మృతి చెందారు. విమానం ల్యాండ్ చేసిన కొన్ని నిమిషాలకే ఆయన అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. దీనితో ఎయిర్ ఇండియా సంస్థతో పాటు… ఈ విషయం తెలిసిన తరువాత ఆ విమానంలోని ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ మృతిపై విచారం వ్యక్తం చేస్తూనే… విమానం గాలిలో ఉన్నప్పుడు ఈ ఘటన జరగలేదు హమ్మయ్యా అనుకుంటున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Air India Pilot Dealth
ఎయిరిండియా(Air India) ఎక్స్‌ప్రెస్ పైలట్ అర్మాన్ బుధవారం శ్రీనగర్ నుంచి దిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని ల్యాండ్ చేశారు. ఆ తర్వాత డిస్పాచ్ ఆఫీస్ కు వెళ్లిన ఆయన అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. తక్షణమే స్పందించిన తోటి సిబ్బంది ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. కానీ దారిలోనే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అంతకుముందు విమానంలో కూడా వాంతులు చేసుకున్నారని సిబ్బంది తెలిపారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత డిస్పాచ్ ఆఫీస్‌కు వెళ్లేముందు కాస్త నీరసంగా కనిపించారని, ఆ వెంటనే గుండెపోటుకు గురయ్యారని చెప్పారు. తమ కళ్లముందే సహోద్యోగికి ఇలా జరగడంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయనకు ఇటీవలే వివాహం జరిగిందని చెప్పారు.
ఈ ఘటనపై ఎయిరిండియా తీవ్ర విచారం వ్యక్తంచేసింది. ‘‘అర్మాన్ ఆకస్మిక మృతికి తీవ్రంగా చింతిస్తున్నాం. ఆయన కుటుంబం గురించే మా ఆలోచనంతా. ఈ క్లిష్ట సమయంలో ఆ కుటుంబానికి మా సహాయ సహకారాలు అందిస్తున్నాం. ప్రతిఒక్కరూ గోప్యత పాటించాలని, ఊహాగానాలు చేయొద్దని కోరుతున్నాం’’ అని సంస్థ ప్రతినిధి అభ్యర్థించారు. ఈ ఘటన నేపథ్యంలో పైలట్ల పని గంటల గురించి మరోసారి చర్చ మొదలైంది.
Also Read : Tahawwur Rana: భారత్ కు తహవ్వుర్ రాణా ! సిద్ధంగా బుల్లెట్‌ప్రూఫ్ వాహనం, కమాండోలు !