Amit Shah: ఆర్టికల్ 370 ఓ చరిత్ర – హోం మంత్రి అమిత్ షా

ఆర్టికల్ 370 ఓ చరిత్ర - హోం మంత్రి అమిత్ షా

Amit Shah: జమ్ముకశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 ఓ ముగిసిన ఘట్టమని, దానిని పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(Amit Shah) అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో ‘సంకల్ప పత్ర’ ను విడుదల చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అందులో 25 తీర్మానాలు ప్రకటించారు. ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని తుడిచిపెట్టడం అందులో మొదటిదన్నారు. అలాగే మహిళల ఆర్థిక భద్రత, స్వావలంబనకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. శాంతియుత, సురక్షిత, సుసంపన్నమైన జమ్మూకశ్మీర్‌ సాధించుకోవడమే ఈ మేనిఫెస్టో లక్ష్యమని తెలిపారు.

Amit Shah Comment

‘‘స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జమ్ముకశ్మీర్‌ కు బీజేపీ ప్రాధాన్యత ఇస్తూనే ఉంది. ఈ నేలను చెక్కుచెదరకుండా ఉంచేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంది. 2014 వరకు జమ్ముకశ్మీర్‌ వేర్పాటువాదం, ఉగ్రవాదం నీడలో ఉండేది. పలువురు నాయకులు రాష్ట్రంలో అస్థిరత సృష్టించారు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. జమ్ముకశ్మీర్‌ చరిత్ర గురించి రాసినప్పుడు 2014 తర్వాత 10 ఏళ్ల కాలం గోల్డెన్‌ పీరియడ్‌గా మిగిలిపోతుంది’’ అని అమిత్‌ షా అన్నారు.

2019లో ఆర్టికల్‌ 370 రద్దవడంతో రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. చివరిసారి 2014లో ఐదు దశల్లో జరిగాయి. ఈసారి మూడు విడతల్లోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ.. తొలిదశలో 24 అసెంబ్లీ స్థానాలకు, రెండు, మూడు దశల్లో వరుసగా 26, 40 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. సెప్టెంబరు 18న తొలి విడత, సెప్టెంబరు 25న రెండో విడత, అక్టోబరు 1న మూడో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబరు 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Also Read : J&K Assembly Polls: జ‌మ్మూక‌శ్మీర్‌ అసెంబ్లీ బరిలో తొలిసారి మహిళా కాశ్మీరీ పండిట్లు !

Leave A Reply

Your Email Id will not be published!