Amit Shah: మైతేయ్, కుకీలతో త్వరలో చర్చలు – కేంద్ర మంత్రి అమిత్‌ షా

మైతేయ్, కుకీలతో త్వరలో చర్చలు - కేంద్ర మంత్రి అమిత్‌ షా

Amit Shah: జాతుల మధ్య ఘర్షణలతో అశాంతి నెలకొన్న మణిపుర్‌లో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోనుంది. ఆ రాష్ట్రంలోని వైరి పక్షాలైన మైతేయ్, కుకీ వర్గాల ప్రజలతో త్వరలో చర్చలు జరిపి వైషమ్యాలను తొలగించేందుకు ప్రయత్నిస్తామని హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. మణిపుర్‌లో గత 13 నెలలుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా అక్కడ మరికొన్ని హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకు దాదాపు ప్రశాంతంగా ఉన్న జిరిబం ప్రాంతానికీ ఇవి విస్తరించడం కేంద్ర ప్రభుత్వాన్ని కలవరపరిచింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆ రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపై సోమవారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

Amit Shah Meet

ఈ సందర్భంగా మణిపుర్‌ లో కేంద్ర భద్రతా బలగాల సంఖ్య పెంచాలని అధికారులను అమిత్‌ షా(Amit Shah) ఆదేశించారు. హింసకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులకు పునరావాసంతో పాటు సరైన విద్య, వైద్య సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్పష్టం చేశారని సమావేశం అనంతరం విడుదల చేసిన ప్రకటనలో అధికారులు తెలిపారు. శాంతిభద్రతల పునరుద్ధరణలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని అమిత్‌ షా భరోసానిచ్చారని పేర్కొన్నారు. తాజాగా హింసాత్మక ఘటనలు జరిగిన రాష్ట్ర రాజధాని ఇంఫాల్, జిరిబంలలో భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచినట్లు ఉన్నతాధికారులు కేంద్ర హోంమంత్రికి వివరించారు. సమావేశంలో గవర్నర్‌ భద్రతా సలహాదారు కులదీప్‌ సింగ్, డీజీపీ రాజీవ్‌ సింగ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వినీత్‌ జోషి తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌ హాజరుకాకపోవడం గమనార్హం.

Also Read : PM Kisan 2024: నేడు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ నిధులు విడుదల !

Leave A Reply

Your Email Id will not be published!