Amit Shah: మావోయిస్టులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక సూచన

మావోయిస్టులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక సూచన

Amit Shah : మావోయిస్ట్‌ పార్టీ శ్రేణులకు కేంద్ర హోం మంత్రి అమిత్‌(Amit Shah) షా కీలక విజ్ఞప్తి చేసారు. ఆయుధాలను వదిలేసి, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని వారికి పిలుపునిచ్చారు. ఒక నక్సలైట్‌ చనిపోతే ఏ ఒక్కరూ సంతోషించరని ఆయన అన్నారు. అంతేకాదు 2026 మార్చి కల్లా వామపక్ష తీవ్రవాదాన్ని రూపుమాపాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. కాబట్టి మావోయిస్టులంతా ఆయుధాలు వీడి అభివృద్ధి ప్రస్థానంలో భాగం పంచుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బస్తర్‌ పండుమ్‌’ ముగింపు వేడుకలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

Amit Shah Comment

ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా(Amit Shah) మాట్లాడుతూ… 2026 మార్చి నాటికి మావోయిస్టుల బెడదను పూర్తిగా నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ‘‘బస్తర్‌లో బుల్లెట్‌ కాల్పులు, బాంబు పేలుళ్ల రోజులు ముగిసిపోయాయి. ఆయుధాలను అడ్డం పెట్ట్టుకొని గిరిజన సోదరులు, సోదరీమణుల అభివృద్ధిని మావోయిస్టులు ఆపలేరు’ అని అమిత్‌ షా పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తాయని భరోసా ఇచ్చారు. తమ ఇళ్లలో, గ్రామాల్లో మావోయిస్టులు ఉండరాదని ప్రజలు నిర్ణయించుకున్నప్పుడే అభివృద్ధి సాధ్యమని, అలా ప్రోత్సహించిన గ్రామాలకు రూ.కోటి చొప్పున ఇస్తామని చెప్పారు.

గత 50ఏళ్లగా బస్తర్‌ అభివృద్ధికి నోచుకోలేదని, బస్తర్‌ ప్రజలు తమ ఇళ్లను, ఊళ్లను నక్సలైట్‌ రహితంగా మార్చాలని బలమైన నిర్ణయం తీసుకుంటేనే అభివృద్ధికి బాటలు పడతాయని స్పష్టం చేశారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇందుకోసం అవసరమైనవన్నీ సమకూర్చేందుకు ప్రధాని మోదీ సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ సుసాధ్యం కావాలంటే బస్తర్‌ ప్రజలు తమ గ్రామాలను నక్సలైట్‌ రహితంగా మార్చాలని నిర్ణయించుకోవాలి. ప్రతి ఒక్కరికీ ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, ఆరోగ్య బీమా సమకూర్చడంతోపాటు చిన్నారులు స్కూలుకు వెళ్లగలిగి, ఆరోగ్య కేంద్రాలు పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యం’అని అమిత్‌ షా అన్నారు.

నక్సలిజాన్ని తుదముట్టించేందుకు ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నామంటూ అమిత్ షా… ‘అభివృద్ధికి ఆయుధాలు, గ్రనేడ్లు, మందుపాతరలతో అవసరం లేదు, కంప్యూటర్లు, పెన్నులు ఉంటే సరిపోతుందని అర్థం చేసుకునే వారు లొంగిపోయారు. 2024లో 881 మంది, 2025లో ఇప్పటివరకు మొత్తం 521 మంది మావోయిస్ట్‌ లు ఆయుధాలను అప్పగించారు. లొంగిపోయిన వారు జన జీవన స్రవంతిలో కలుస్తారు, మిగిలిన వారి పనిని భద్రతా బలగాలు చూసుకుంటాయి. వచ్చే ఏడాది మార్చి కల్లా రెడ్‌ టెర్రర్‌ నుంచి దేశానికి విముక్తి కలుగనుంది’అని అమిత్‌ షా అన్నారు.

Also Read : PM Narendra Modi: ప్రధాని మోదీకు ‘మిత్ర విభూషణ’ అవార్డు ప్రదానం చేసిన శ్రీలంక

Leave A Reply

Your Email Id will not be published!