Amit Shah: మావోయిస్టులకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్
మావోయిస్టులకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్
Amit Shah : మావోయిస్టులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వర్షాకాలంలోనూ మావోయిస్టు ఏరివేత ఆపరేషన్లు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయుధాలు వీడి, అభివృద్ధి పథంలో కలిసి రావాలని మావోయిస్టులకు పిలుపునిచ్చారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఛత్తీస్‌గఢ్ చేరుకున్న అమిత్ షా (Amit Shah)… రాయ్‌పుర్ అటల్ నగర్‌లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ) క్యాంపస్, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లకు శంకుస్థాపన చేశారు.
Amit Shah Warning
అనంతరం ఆయన మాట్లాడుతూ… ‘‘ప్రతిసారి వర్షాకాలంలో పరిస్థితులను అనుకూలంగా తీసుకుని మావోయిస్టులు విశ్రాంతి తీసుకునేవారు. కానీ, ఈసారి వర్షాకాలంలో వారిని నిద్రపోనివ్వం. 2026 మార్చి నాటికి మావోయిస్టు రహిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా మరింత ముందుకెళ్తాం’’ అని అమిత్ షా పేర్కొన్నారు. మావోయిస్టులు లొంగిపోవాలని, ఆయుధాలు వీడి… అభివృద్ధి ప్రయాణంలో చేరాలని పిలుపునిచ్చారు. వారితో చర్చలు అవసరం లేదన్నారు. సాయుధ పోరాటాన్ని వదులుకుని జనజీవన స్రవంతిలో చేరే వారికి మరింత సాయం చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ప్రధాని మోదీ దార్శనికత చాలా స్పష్టంగా ఉందని అమిత్ షా అన్నారు. ‘‘మా ప్రభుత్వం కేవలం ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధిపైనే దృష్టి పెట్టడం లేదు. సకాలంలో న్యాయం అందించేందుకూ చర్యలు తీసుకుంటోంది. కొత్త చట్టాలు దీనికి దోహదపడతాయి’’ అని తెలిపారు. ఇదిలా ఉండగా.. నక్సలిజం సమస్యపై ఛత్తీస్‌గఢ్‌తోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఒడిశా ఉన్నతాధికారులతో అమిత్ షా సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
Also Read : Operation Sindhu: ఇజ్రాయెల్ నుంచి భారతీయుల తరలింపు ప్రారంభం
