Amrutha: ప్రణయ్‌ హత్య కేసులో కోర్టు తీర్పుపై తొలిసారి స్పందించిన అమృత

ప్రణయ్‌ హత్య కేసులో కోర్టు తీర్పుపై తొలిసారి స్పందించిన అమృత

Amrutha : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసులో(Pranay Case) నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఏ1 గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు ఇప్పటికే ఆత్మహత్య చేసుకోగా… ఏ2కు మరణ శిక్ష విధించింది. మిగిలిన ఆరుగురికి యావర్జీవ కారాగార శిక్ష వేసింది. అయితే కోర్టు తీర్పుపై అమృత తొలిసారి స్పందించారు. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత తమకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. తన హృదయం భావోద్వేగాలతో నిండిపోయిందని… ఈ తీర్పుతోనైనా పరువు పేరిట జరిగే దారుణాలు ఆగుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తన బిడ్డ పెరుగుతున్నాడని, అతడి భవిష్యత్తును, తన మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మీడియా ముందుకు రాలేకపోతున్నట్లు తెలిపారు. దయచేసి తమను అర్థం చేసుకోవాలని కోరారు. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన పోలీసు శాఖ, న్యాయవాదులు, మీడియా సిబ్బందికి అమృత కృతజ్ఞతలు తెలిపారు.

Amrutha – Pranay Case

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో జరిగిన ప్రణయ్‌ పరువు హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష, మరో ఆరుగురికి జీవితఖైదు విధిస్తూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం, రెండో అదనపు సెషన్స్‌ జిల్లా కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. తన కుమార్తె అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు 2018 సెప్టెంబర్‌ 14న సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ ను హత్య చేయించడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ కేసును ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీస్‌ యంత్రాంగం… విచారణ చేపట్టి ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొంటూ 2019లో ఛార్జిషీటు దాఖలు చేసింది. దాదాపు ఐదేళ్లకు పైగా కోర్టులో విచారణ సాగగా.. ఇటీవలే వాదనలు ముగిశాయి. తాజాగా సోమవారం నల్గొండ కోర్టు దోషులకు శిక్షలు ఖరారు చేస్తూ తుది తీర్పు వెలువరించింది.

Also Read : Group-2: తెలంగాణ గ్రూప్‌-2 ఫలితాలు విడుదల ! టాప్‌ 10 ర్యాంకర్లు వీరే !

Leave A Reply

Your Email Id will not be published!