Amur Falcon: 22వేల కిలోమీటర్ల ప్రయాణం చేసిన రేడియో-ట్యాగ్ చేసిన ఫాల్కన్ పక్షి

22వేల కిలోమీటర్ల ప్రయాణం చేసిన రేడియో-ట్యాగ్ చేసిన ఫాల్కన్ పక్షి

Amur Falcon : 2024 నవంబర్‌ లో మణిపూర్‌ లో రేడియో-ట్యాగ్ చేయబడిన అముర్ ఫాల్కన్(Amur Falcon) పక్షి… కెన్యాకు చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పక్షి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ఈ ఫాల్కన్ పక్షి దక్షిణాఫ్రికా దేశాలలో 114 రోజులు గడిపిన తర్వాత సైబీరియాకు తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. గతేడాది అక్టోబర్ 12న, మణిపూర్‌ లోని తమెంగ్‌లాంగ్ జిల్లాలోకి సైబీరియా నుండి రెండు అముర్ ఫాల్కన్(Amur Falcon) పక్షులు వచ్చాయి. వాటిని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు రేడియో-ట్యాగ్ చేశారు. తమెంగ్‌లాంగ్ జిల్లాలోని రెండు గ్రామాల పేరు మీద మగ పక్షికి ‘చిలువాన్ 2’ అని, ఆడ పక్షికి ‘గ్వాంగ్రామ్’ అని పేరు పెట్టి వదిలారు. ఇవి అనేక దేశాల మీదుగా దాదాపు 22వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఇటీవల కెన్యా దేశానికి చేరుకున్నాయి. ఈ 22 వేల కిలోమీటర్ల తన ప్రయాణంలో ఎన్నో మజిలీలు తెలిసొచ్చాయి.

Amur Falcon Travel 22000 KM

“చియులువాన్ 2 ఇప్పుడు సైబీరియాకు తిరుగు ప్రయాణంలో ఉంది. ఇది జింబాబ్వే, టాంజానియాను దాటి ప్రస్తుతం కెన్యా-సోమాలియా సరిహద్దుకు సమీపంలో ఉంది. ఇది ఏప్రిల్ 8 ఉదయం బోట్స్వానా నుండి ఉత్తరం వైపు ప్రయాణాన్ని ప్రారంభించింది” అని ఈ పక్షి వలస మార్గాన్ని పర్యవేక్షిస్తున్న WII సీనియర్ శాస్త్రవేత్త సురేష్ కుమార్ అన్నారు. గత ఏడాది నవంబర్ 8న మణిపూర్(Manipur) నుంచి బయలుదేరిన ఈ పక్షి గత ఏడాది డిసెంబర్ 20న దక్షిణాఫ్రికాకు చేరుకుందని, ఆ తర్వాత బోట్స్వానాకు వెళ్లి అక్కడ ఒక నెలకు పైగా ఉండిపోయిందని సురేష్ కుమార్ చెప్పారు. ఈ ఫాల్కన్ పక్షి(చియులువాన్ 2) దక్షిణాఫ్రికాలో 114 రోజులు ఉన్నాక, బోట్స్వానాలోని సెంట్రల్ కలహరి రిజర్వ్‌లో 46 రోజులు గడిపింది. అక్కడి నుండి తిరుగు ప్రయాణం ప్రారంభించింది అని కుమార్ చెప్పారు.

10 రోజుల తర్వాత చియులువాన్ 2 సముద్ర ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశం ఉందని కుమార్ తెలిపారు. కాగా, మణిపూర్‌లోని తమెంగ్‌లాంగ్ జిల్లాలో ఉపగ్రహ ట్రాన్స్‌మిటర్లతో రేడియో-ట్యాగింగ్ చేసిన తర్వాత, చియులువాన్ 2ను గతేడాది నవంబర్ 8న గాల్లోకి వదిలిపెట్టారు. చియులువాన్ 2 బంగ్లాదేశ్, ఒడిశా, మహారాష్ట్ర గుండా ప్రయాణించి చివరికి అరేబియా సముద్రం దాటి గత సంవత్సరం నవంబర్ చివరి వారంలో సోమాలియా-కెన్యా సరిహద్దులకు ఈ పక్షి చేరుకుంది.

“తిరుగు ప్రయాణంలో ఈ అముర్ ఫాల్కన్లు(Amur Falcon) తమెంగ్‌ లాంగ్‌ లో ఆగవు. మే నుండి అక్టోబర్ వరకు అముర్ నది ప్రాంతంలో వాటి సంతానోత్పత్తి కాలం తర్వాత అవి అక్టోబర్‌లో తిరిగి వస్తాయి” అని తమెంగ్‌లాంగ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డిఎఫ్‌ఓ) హిట్లర్ సింగ్ తెలిపారు. మణిపూర్‌ లోని టామెంగ్‌ లాంగ్‌ లో రేడియో-ట్యాగ్ చేయబడిన ఆడ పక్షి గ్వాంగ్రామ్… “డిసెంబర్ 2024లో కెన్యా సమీపంలో ఎక్కడో ఉన్నప్పుడు ఉపగ్రహ డేటాను ఇవ్వడం ఆపివేసింది” అని DFO ఆడపక్షి వివరాలు సైతం వెల్లడించారు. ప్రతి శీతాకాలం సమీపిస్తున్నప్పుడు అముర్ ఫాల్కన్లు సైబీరియా, ఉత్తర చైనాలోని కఠినమైన చల్లని వాతావరణాన్ని విడిచిపెట్టి, దక్షిణాఫ్రికాలోని శీతాకాలపు ప్రదేశాలకు వెళ్లడానికి దాదాపు 14,500 కి.మీ దూరం ప్రయాణించి, తరువాత ఏప్రిల్-మే నెలల్లో తిరుగు ప్రయాణాన్ని ప్రారంభిస్తాయని సింగ్ తెలిపారు.

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం ప్రయాణించే పక్షులలో ఒకదాని వలస మార్గాన్ని అధ్యయనం చేయడమే ఈ పరిశోధన లక్ష్యం అని సింగ్ చెప్పారు. అముర్ ఫాల్కన్ వార్షిక వలసలు దాదాపు 22,000 కి.మీ. దూరాన్ని కవర్ చేస్తాయన్నారు. నాగాలాండ్, మణిపూర్,ఇంకా ఈశాన్య ప్రాంతంలోని కొన్ని ఇతర ప్రాంతాలలో ఆగడానికి సైబీరియా నుండి వచ్చిన తరువాత, స్థానికంగా ‘అఖుయిపుయినా’ అని పిలువబడే అముర్ ఫాల్కన్లు సగటున 45 రోజులు విహరిస్తాయి. అక్కడ అవి రాబోయే కష్టతరమైన ప్రయాణానికి సంబంధించి తగిన శక్తిని పుంజుకుంటాయని సింగ్ వెల్లడించారు.

Also Read : CM Siddaramaiah: ముడా కేసులో కర్ణాటక సీఎం దంపతులకు హైకోర్టు నోటీసులు

Leave A Reply

Your Email Id will not be published!