Andhra Pradesh Government: ఏపీలో డ్వాక్రా మహిళలకు 5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు !

ఏపీలో డ్వాక్రా మహిళలకు 5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు !

Andhra Pradesh Government: ఏపీ(AP)లో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డ్వాక్రా సంఘాల్లోని మహిళల జీవనోపాధి కల్పనకు బ్యాంకుల ద్వారా ఇస్తున్న గ్రూప్ రుణాలతో పాటు… పెద్ద మొత్తంలో వ్యక్తిగత రుణాలు కూడా అందించి ప్రోత్సహించాలని నిర్ణయించింది. బ్యాంకులతో మాట్లాడి ఒక్కో సభ్యురాలికి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు రుణంగా ఇప్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఒకే సమయంలో సంఘంలో గరిష్ఠంగా ముగ్గురికి అందించే వెసులుబాటు ఉంది. ఇప్పటికే ఏదైనా యూనిట్‌ (జీవనోపాధి) ఉన్నవారికి, కొత్తగా ఏర్పాటు చేసుకోవాలనే వారికి ఈ రుణాలు అందిస్తారు. ఈ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నర మంది డ్వాక్రా మహిళలకు రూ. 2 వేల కోట్ల మేర వ్యక్తిగత రుణాలు అందించాలని సెర్ప్‌ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 1.35 లక్షల మందికి రూ.లక్ష మేర, 15 వేల మందికి రూ.5 లక్షల రుణాలను అందించనున్నారు. లబ్ధిదారుల ఆసక్తి, యూనిట్‌ ఏర్పాటు వ్యయానికి అనుగుణంగా రుణాన్ని భవిష్యత్తులో రూ.10 లక్షలకు కూడా పెంచుతామని పేర్కొంటున్నారు.

డ్వాక్రా మహిళలకు మరింత మేలు చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలైన ప్రధానమంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పథకం (పీఎంఎఫ్‌ఎంఈ), ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమాల్ని (పీఎంఈజీపీ) దీనికి అనుసంధానించాలని నిర్ణయించింది. ఈ పథకం కింద ఎంపిక చేసిన జీవనోపాధి ఏర్పాటు చేసుకున్నవారికి రుణంలో 35 శాతం రాయితీ వర్తిస్తుంది. ఉదాహరణకు రూ.లక్ష రుణం తీసుకుంటే రూ.35 వేలు రాయితీ కింద మినహాయిస్తారు. మిగతా మొత్తాన్ని లబ్ధిదారులు నెలవారీ వాయిదాల్లో తిరిగి చెల్లించాలి.

Andhra Pradesh Government – 35% రాయితీ వర్తించే రూ.లక్ష నుంచి రూ.5 లక్షలతో ఏర్పాటు చేసుకోగలిగే యూనిట్లు ఇవే !

కారంపొడి, పసుపు, మసాలా పొడి ప్యాకింగ్‌ యూనిట్‌
తేనె తయారీ
బేకరీ, స్వీట్‌ షాప్‌
ఐస్‌క్రీమ్‌
ఊరగాయల తయారీ, ప్యాకింగ్‌ యూనిట్‌
అప్పడాల తయారీ
వెజిటబుల్‌ సోలార్‌ డ్రయ్యర్‌
భోజనం (బఫే) ప్లేట్ల తయారీ
డీజే సౌండ్‌ సిస్టమ్‌
డెయిరీ
పౌల్ట్రీ

Also Read : Vice Chancellor Appointments: 17 యూనివర్సిటీలకు ఇన్‌ ఛార్జ్‌ వీసీల నియామకం !

Leave A Reply

Your Email Id will not be published!