Anna Hazare: కేజ్రీవాల్ అరెస్టుపై అన్నా హజారే సంచలన ప్రకటన !
కేజ్రీవాల్ అరెస్టుపై అన్నా హజారే సంచలన ప్రకటన !
Anna Hazare: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే(Anna Hazare) సంచలన ప్రకటన చేసారు. అవినీతి వ్యతిరేక ‘జన్ లోక్ పాల్’ ఉద్యమంలో భాగమైన అరవింద్ కేజ్రీవాల్… ఇప్పుడు అవినీతి కేసులోనే అరెస్టు కావడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. కోట్లాది మంది ప్రజలకు కేజ్రీవాల్ నమ్మక ద్రోహం చేశారని… ఆయన రాజకీయ ఆశయాలు 2011 నాటి ఉద్యమాన్ని నాశనం చేశాయని ఆరోపించారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘దిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో కేజ్రీవాల్ ను అరెస్టు చేయడం బాధగా ఉంది. ఒకప్పుడు అవినీతిపై పోరాటంలో నా సహచరుడు… ఇప్పుడు అవినీతి కేసులోనే అరెస్టు కావడం విడ్డూరంగా ఉంది. ‘జన్‌లోక్‌పాల్’ రాజకీయ ప్రత్యామ్నాయం విఫలం కావడం దురదృష్టకరం. కేజ్రీవాల్ రాజకీయ ఆకాంక్షల వల్లే అవినీతి వ్యతిరేక ఉద్యమం నాశనమైంది’’ అని కేజ్రీవాల్‌ను ఉద్దేశించి అన్నా హజారే తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్ ‘స్వరాజ్’ పుస్తకంలో మద్యం పాలసీకి సంబంధించిన అంశాలపై 2022లో రాసిన లేఖలోనే తాను హెచ్చరించినట్లు గుర్తు చేశారు.
Anna Hazare Comment
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా రాలేగావ్ సిద్ధి గ్రామ అభివృద్దికి కృషి చేసిన అన్నా హజారే ప్రముఖ సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారు. రాలేగావ్ సిద్ధి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటానికి తను చేసిన ప్రయత్నాలకు గుర్తింపుగా 1990 లో పద్మశ్రీ అవార్డు తోనూ, 1992 లో పద్మ భూషణ్ అవార్డుతోను భారత ప్రభుత్వం ఆయనను సత్కరించింది. ఆ తరువాత ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై పోరాడేందుకోసం పాటుపడిన ప్రముఖ వ్యక్తులలో ఒకడిగా నిలిచాడు. 5 ఏప్రిల్ 2011 న జనలోక్ పాల్ చట్టాన్ని పోలిన లోక్ పాల్ అవినీతి నిరోధక చట్టాన్ని తేవాలని ప్రభుత్వాన్ని కోరుతూ నిరవధిక నిరాహరదీక్ష చేపట్టాడు.
అప్పటికే ఐఏఎస్ అధికారిగా రిటైర్మెంట్ ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)… అన్నా హజారేతో కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టారు. దేశమంతా దీనికి మద్ధతు లభించింది. 2011 ఏప్రిల్ 9 న ప్రభుత్వం అంగీకరించిన తరువాత నిరాహారదీక్ష విరమించాడు. ప్రభుత్వం ఒక పౌరసమాజం ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులతో సంయుక్త సంఘాన్ని ఏర్పాటుచేసింది. అయితే మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారం కోల్పోయి… మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత అన్నా హజారే పూర్తిగా సైలంట్ అయిపోయారు.
అన్నా హజారేతో కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసిన అరవింద్ కేజ్రీవాల్… ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ను స్థాపించి… ఢిల్లీ సీఎంగా గత పదేళ్ళుగా కొనసాగుతున్నారు. అయితే అనూహ్యంగా ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంకు సంబంధించి జరిగిన అవినీతి కేసులో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. అంతేకాదు రౌజ్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ ను… ఈడీకు వారం రోజుల పాటు కస్టడీకు అప్పగించింది.
Also Read : Arvind Kejriwal : కేజ్రీవాల్ ను తీహార్ జైలుకి పంపితే శిక్షపడేలా చేస్తానంటున్న నిందితుడు సుఖేష్