SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుండి ప్రాజెక్టు ఇంజినీర్ మనోజ్ కుమార్ మృతదేహం వెలికితీత
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుండి ప్రాజెక్టు ఇంజినీర్ మనోజ్ కుమార్ మృతదేహం వెలికితీత
SLBC Tunnel : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగ ప్రమాదంలో శిథిలాల కింద కూరుకుపోయిన వారిలో మరొకరి మృతదేహం మంగళవారం లభ్యమైంది. సొరంగంలో అనుమానిత ప్రదేశాలకు ముందుభాగంలోనే ఈ మృతదేహాన్ని గుర్తించారు. మృతుడిని జేపీ కంపెనీకి చెందిన ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్‌కుమార్ (50)గా గుర్తించారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సహాయ బృందాలు మనోజ్‌కుమార్ మృతదేహాన్ని సొరంగం నుంచి బయటకు తీసుకొచ్చాయి. అనంతరం జిల్లా కలెక్టర్ సంతోష్ సమక్షంలో ప్రత్యేక అంబులెన్సులో నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు.
Antother Dead Body from SLBC Tunnel
పోస్టుమార్టం అనంతరం… రెవెన్యూ, వైద్య, పోలీసు శాఖల నుంచి ఒక్కొక్కరిని అంబులెన్సుతోపాటు పంపించి స్వగ్రామంలో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని కలెక్టర్ తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆర్డీఓ సురేశ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫున మృతుని కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును అందించారు. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్‌లో మనోజ్‌కుమార్ స్వగ్రామం యూపీలోని ఉన్నావ్ జిల్లా బంగార్మావ్ గ్రామానికి తరలించారు. మనోజ్‌కుమార్ 2009 నుంచి జేపీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య స్వర్ణలత, కుమార్తె శైలజ (24), కుమారుడు ఆదర్శ్ (17) ఉన్నారు.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ(SLBC Tunnel)) సొరంగంలో ఫిబ్రవరి 22న జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. దేశంలోనే నైపుణ్యం కలిగిన 12 సంస్థల బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఈ నెల 9 ఒక మృతదేహాన్ని (గురుప్రీత్‌సింగ్) వెలికితీయగా డీ2 ప్రాంతానికి సుమారు 190 మీటర్ల దూరంలో వెనక వైపు, కన్వేయర్ బెల్టుకు సమీపంలో మనోజ్‌కుమార్ మృతదేహం లభ్యమైంది. సొరంగానికి కుడి వైపున కన్వేయర్ బెల్టు ఉండగా బెల్టు సమీపంలో ఇప్పటికే ఒకవైపు నుంచి తవ్వకాలు చేపడుతూ సహాయక బృందాలు మార్గాన్ని ఏర్పాటు చేస్తూ ఎడమ వైపున మట్టి వేశాయి.
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు సహాయ చర్యలను ముమ్మరం చేశామని… ఏప్రిల్ 10 నాటికి మిగిలిన ఆరుగురి ఆచూకీని గుర్తించే అవకాశం ఉన్నట్లు సింగరేణి జనరల్ మేనేజర్ దేబులాల్ బైద్య పేర్కొన్నారు. కన్వేయర్ బెల్టు నుంచి 60 మీటర్ల వరకు ఇప్పటికే మట్టిని తొలగించామని, మరో 253 మీటర్ల వరకు మట్టిని తొలగిస్తే ఫలితం ఉంటుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, సింగరేణి, హైడ్రా తదితర ఏజెన్సీల సిబ్బంది నిరంతరం సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
Also Read : CCTV Cameras: ఎంఎంటీఎస్ బోగీల్లో సీసీ టీవీ కెమెరాలు