AP Assembly Sessions: పెన్షన్లు, యూరియా పంపిణీలపై వేడెక్కిన అసెంబ్లీ
పెన్షన్లు, యూరియా పంపిణీలపై వేడెక్కిన అసెంబ్లీ
AP Assembly Sessions : పెన్షన్లు, యూరియా, టిడ్కో ఇల్లు, మద్యం పాలసీ తదితత అంశాలపై శాసన సభ సమావేశాలు వాడీ వేడిగా ప్రారంభమయ్యాయి. ఈ నాలుగు అంశాలపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. చివరకు వైసీపీ ఎమ్మెల్సీలు సభ నుండి వాకౌట్ చేసారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
AP Assembly Sessions Sensational for Urea
యూరియా (Urea) అంశంపై శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. యూరియా సహా రైతు సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. యూరియా సమస్యలపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబడుతూ తీర్మానం ఇచ్చారు. దీనిపై మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు స్పందిస్తూ… వైసీపీ తీర్మానాన్ని తిరస్కరించారు. మరో రోజు ఈ అంశంపై స్వల్పకాలిక చర్చ చేపడతామని సముదాయించారు. అయినా వైసీపీ సభ్యులు శాంతించకపోవడంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక కూడా వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు.
యూరియా (Urea) అంశంపై చర్చకు వాయిదాలు ఎందుకని బొత్స సత్యనారాయణ అన్నారు. గతంలో రైతులు రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ సభలో ఏరోజు అజెండా ఆరోజు ఉందన్నారు. ప్రభుత్వం చర్చ నుంచి పారిపోవడం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఏం చేసింది.. ఈ ప్రభుత్వం ఏం చేసిందనే విషయాలు ప్రజలు తెలియాలన్నారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుందనే విషయాలు వారికి చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని.. చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందామని మండలి ఛైర్మన్ అన్నారు.
అర్హులకు పింఛన్లు ఎక్కడా తొలగించలేదు – మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అర్హులకు పింఛన్లు ఎక్కడా తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. లబ్ధిదారులు ఎవరైనా చనిపోతే వెంటనే ఆ కుటుంబంలో మరొకరికి ఇస్తున్నామని చెప్పారు. అనర్హులకు మాత్రమే నోటీసులు ఇస్తున్నామని చెప్పారు. పింఛను పథకంపై శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 50-59 ఏళ్ల మధ్య ఉన్న 11,98,501 మంది పింఛను పొందుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పేదలకు ఇచ్చే పింఛన్లను రూ.3వేల నుంచి రూ.4వేలకు ఒకేసారి పెంచామన్నారు. అనర్హులకు నోటీసులు ఇచ్చి 2 నెలల్లో రీ వెరిఫికేషన్ చేయాలని వైద్యశాఖకు సూచించామని తెలిపారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వం పింఛన్లు ఇస్తోందన్నారు.
నిలిచిపోయిన టిడ్కో గృహ సముదాయాల పనులు ప్రారంభం – మంత్రి నారాయణ
పెండింగ్‌లో ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తిచేసేందుకు రూ.6,300 కోట్లు అవసరమని మంత్రి నారాయణ అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా టిడ్కో ఇళ్ల నిర్మాణంపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. గత వైకాపా ప్రభుత్వం రూ.3,664 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టిందన్నారు. కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆగిపోయిన టిడ్కో గృహ సముదాయాలను పూర్తి చేసేందుకు పనులు ప్రారంభించామన్నారు.
Also Read : KTR: ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు ముడుపుల రేవంత్‌రెడ్డి – కేటీఆర్
