Garbage Tax: ఏపీలో చెత్త పన్ను వసూళ్ల నిలిపివేత !
ఏపీలో చెత్త పన్ను వసూళ్ల నిలిపివేత !
Garbage Tax: నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూళ్లు నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చెత్త పన్ను వసూళ్ళపై తదుపరి ఉత్తర్వులొచ్చే వరకు ప్రజల వద్ద నుండి పన్ను వసూలు చేయొద్దని పుర, నగరపాలక సంస్థలకు అధికారులు మౌఖిక ఆదేశాలనిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో వసూళ్లు నిలిపేయాలని వార్డు సచివాలయాలకు పుర కమిషనర్లు సూచించారు.
చెత్త సేకరణ పేరుతో జగన్ ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని ఇళ్ల నుంచి నెలకు రూ.30 నుంచి రూ.150 చొప్పున ఏటా దాదాపు రూ.200 కోట్లు వసూలుచేసింది. ఎన్నికల ముందు వసూళ్లను తాత్కాలికంగా నిలిపేసింది. అయితే ఈ చెత్త పన్ను వసూళ్లను టీడీపీ, జనసేన మొదటినుంచీ వ్యతిరేకిస్తున్నాయి. ఏటా 15% చొప్పున ఆస్తి పన్ను పెంచుతూనే చెత్త పన్ను వసూలు చేయడాన్ని నిలదీశాయి. చెత్త సేకరణ పేరుతో అస్మదీయ సంస్థలకు రూ.కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం దోచిపెడుతుందన్న ఆరోపణలు గుప్పించాయి.
Garbage Tax – ‘క్లాప్’ పేరుతో భారీ కుంభకోణం?
క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) పేరుతో ఇళ్ల నుంచి చెత్త సేకరించడాన్ని 2021 అక్టోబరులో వైసీపీ(YCP) ప్రభుత్వం ప్రారంభించింది. ఆ వెంటనే చెత్త పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వంలో కొందరు పెద్దలు తమ సన్నిహితుల ద్వారా దాదాపు 2,164 ఆటోలు కొనిపించారు. వీటిని స్వచ్ఛాంధ్ర సంస్థ ద్వారా 48 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు ఇచ్చారు. ప్రజల నుంచి వినియోగ రుసుములు వసూలుచేసి చెత్త తరలించే ఒక్కో ఆటోకు నెలకు రూ.65 వేల చొప్పున కిరాయి చెల్లించాలని ప్రభుత్వం పుర కమిషనర్లను ఆదేశించింది. ఆటోల సేకరణ నుంచి కాంట్రాక్టు ఒప్పందం వరకు అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి.
క్లాప్‌లో భాగంగా రెండో విడత మరో 36 పట్టణ స్థానిక సంస్థల్లో చెత్త సేకరణకు స్వచ్ఛాంధ్ర సంస్థ రూ.21.18 కోట్లు వెచ్చించి కొన్న ఈ-ఆటోలు అత్యధికం షెడ్లకే పరిమితమయ్యాయి. 2023 జూన్ 8న అప్పటి సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించిన ఆటోలను తాడేపల్లి నుంచి అతి కష్టంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పుర, నగరపాలక సంస్థలకు పంపినా వీటిలో అత్యధికం ఇప్పటికీ పని చేయడం లేదు. ఒక ప్రైవేటు సంస్థ ద్వారా ఈ-ఆటోలు కొనుగోలు చేయించి నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి.
Also Read : Droupadi Murmu: సినీ, మీడియా రంగం టైటాన్‌ను కోల్పోయింది – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము