AP Government: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు స్త్రీ శక్తి పథకం జీవో జారీ చేసిన ప్రభుత్వం
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు స్త్రీ శక్తి పథకం జీవో జారీ చేసిన ప్రభుత్వం
AP Government : ఏపీవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. ‘స్త్రీ శక్తి ‘ పథకం పేరిట మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం (Free Bus) కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల(ఆగస్టు) 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఐదు కేటగిరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల్లో వెల్లడించింది. ప్రయాణ సమయంలో మహిళలు జీరో టికెట్ ఇస్తారు. ఇందుకు అయ్యే ఖర్చు APSRTCకి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది.
AP Government – Free Bus
పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ , ఎక్స్‌ప్రెస్, బస్సుల్లో ఉచిత ప్రయాణం (Free Bus) కల్పిస్తున్నట్లు పేర్కొంది. బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు బస్సుల్లో తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయొచ్చని సూచించింది. తిరుమల – తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని క్లారిటీ ఇచ్చింది. నాన్ స్టాప్ , ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతరాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
సప్తగిరి ఎక్స్ ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్ , ఏసీ బస్సులకు ఉచిత ప్రయాణం పథకం వర్తించదని తేల్చిచెప్పింది. బస్సుల్లో రద్దీ పెరగనున్న దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆదేశించింది. కండక్టర్లకు బాడీ ఒర్న్ కెమెరాలు ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేసింది. బస్టాండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్దేశించింది. తగు చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ (APSRTC) ఎండీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.
ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం:
▪️ పల్లెవెలుగు (Pallevelugu)
▪️అల్ట్రా పల్లెవేలుగు (Ultra Pallevelugu)
▪️సిటీ ఆర్డినరీ (City Ordinary)
▪️మెట్రో ఎక్స్‌ప్రెస్ (Metro Express)
▪️ఎక్స్‌ప్రెస్ సర్వీసులు (Express Services)
ఈ బస్సుల్లో వర్తించదు:
▪️నాన్-స్టాప్ సర్వీసులు, ఇంటర్‌స్టేట్ బస్సులు
▪️కాంట్రాక్ట్ క్యారేజ్, చార్టర్డ్, ప్యాకేజ్ టూర్లు.
▪️సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, అన్ని AC బస్సులు.
ఫ్రీ బస్సు పథకం పచ్చి మోసం – వైసీపీ
ఫ్రీ బస్సు పేరుతో కూటమి ప్రభుత్వం మహిళలను దారుణంగా వంచించిందని, జీవోలో పేర్కొన్న నిబంధనలు చూస్తే మహిళలకు మేలు చేయాలన్న ఆశయం కంటే వారిని మోసం చేయాలన్న తపనే ఎక్కువగా కనిపిస్తోందని వైయస్సార్సీపీ (YSRCP) రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నాటక, తెలంగాణలో ఇప్పటికే అమలవుతున్న పథకాన్ని అంతకన్నా బాగా అమలు చేస్తామని 15 నెలల సమయం తీసుకుని అంతకన్నా హీనంగా అమలు చేస్తున్నారని ఆరోపించారు. కూటమి నాయకులు చెప్పినట్టు మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణించి పుణ్యక్షేత్రాలు సందర్శించాలంటే ఎన్ని రోజులు పడుతుందని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని ప్రశ్నించారు.
ఉచిత బస్సు కోసం ఎన్నిసార్లు ఎక్కిదిగాలి ?
ఎన్నికలకు ముందు మహిళలకు ఫ్రీ బస్ పేరుతో చంద్రబాబు (CM Chandrababu), పవన్ కళ్యాణ్, నారా లోకేష్ విచ్చలవిడిగా ప్రచారం చేసి తీరా అధికారంలోకి వచ్చాక మహిళలను పట్టించుకున్న పాపానపోలేదు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. అన్ని పుణ్య క్షేత్రాలను రూపాయి ఖర్చు లేకుండా సందర్శించవచ్చని, ఎవరైనా టికెట్ అడిగితే నా పేరు చెప్పమని చంద్రబాబు ఊదరగొట్టాడు. నేనే సేఫ్ డ్రైవర్ అని ప్రచారం చేసుకున్నాడు. దాదాపు 15 నెలల తర్వాత పథకాన్ని అమలు చేసే పేరుతో షరతులు విధించి మహిళలను వంచనకు గురిచేస్తున్నారు. కేవలం 5 రకాల బస్సుల్లో మాత్రమే ఫ్రీ బస్ పథకం అమలు చేస్తామని ఉచిత ప్రయాణానికి షరతులు విధించి జీవో ఎంస్ నెంబర్ 27 ఇచ్చారు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్సప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. నాన్ స్టాప్, ఇంటర్ స్టేట్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, అన్నిఏసీ సర్వీసులకు ఈ పథకం వర్తించదని చెప్పారు.
పుణ్య క్షేత్రాలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లొచ్చని ఎన్నికలకు ముందు చెప్పి తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సర్వీసులో కూడా టికెట్ తీసుకోవాలనే నిబంధన పెట్టడం దారుణం. కేవలం 50 కిమీల పరిధిలో తిరిగే బస్సులకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయడం మహిళలను వంచించడమే. మరీ దారుణంగా అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లాల సర్వీసుల్లో, కాంట్రాక్ట్ సర్వీసులకి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయకపోవడం చూస్తుంటే ఎవరి కోసం పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు.? కూటమి ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో ఉచిత బస్సుల్లో పుణ్యక్షేత్రాలు తిరగడం అయ్యే పనేనా.? శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి తిరుమల చేరుకోవాలంటే ఎన్నిసార్లు ఎన్ని బస్సులు ఎక్కి దిగాలో ముఖ్యమంత్రి ఆలోచించారా.? మీరు చెప్పినట్టు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో పుణ్యక్షేత్రాలు తిరగాలంటే కనీసం మూడు నాలుగు రోజులు ప్రయాణించాలా లేదా.? కర్నాటక, తెలంగాణలో అమలవుతున్న పథకాన్ని అమలు చేయడానికి 15 నెలల సమయం తీసుకుని కూడా అంతకన్నా దరిద్రంగా అమలు చేసే ప్రయత్నం చేయడం కూటమి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అని అన్నారు.
Also Read : AP High Court: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల వేళ వైసీపీకి హైకోర్టు షాక్
