AP CM CUP : ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ శాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో వివిధ క్రీడా విభాగాలలో ఏపీ సీఎం కప్(AP CM CUP) పేరుతో క్రీడా పోటీలు నిర్వహించనుంది. ఈ మేరకు శాప్ ఎండీ హర్షవర్దన్ కీలక ప్రకటన చేశారు.
ఈ రాష్ట్ర స్థాయి ఏపీ సీఎం కప్ పోటీలు వచ్చే నెల మే 1 నుంచి 5వ తేదీ వరకు ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రమైన తిరుపతిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు హాజరుకానున్నారు.
సీఎం జగన్ రెడ్డి మార్గదర్శకత్వంలో రాష్ట్ర ఏపీ టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా ఆధ్వర్యంలో తిరుపతిలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని రీతిలో నభూతో నభవిష్యత్ అన్న రీతిలో వీటిని నిర్వహించాలని ఇప్పటికే సీఎం జగన్ ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు మంత్రి ఆర్కే రోజా సెల్వమణి(RK Roja Selvamani).
మొత్తం క్రీడా రంగానికి సంబంధించి 14 క్రీడా విభాగాలలో పోటీలు నిర్వహిస్తారు. ఇందులో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్ , బాస్కెట్ బాల్ , బాక్సింగ్ , ఫుట్ బాల్ , హ్యాండ్ బాల్ , కబడ్డీ, ఖోఖో , హాకీ, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాలలో పోటీలు నిర్వహిస్తారు. ఈ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు, జట్లకు వసతి, ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
Also Read : గురుకులాల్లో 4,006 టీజీటీ పోస్టులు