AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో గోవిందప్ప అరెస్ట్
ఏపీ లిక్కర్ స్కాంలో గోవిందప్ప అరెస్ట్
AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో మైసూరులో ఆయన్ను అరెస్ట్ చేసి… విజయవాడకు తరలిస్తున్నారు. గోవిందప్ప భారతీ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గా ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరుకావాలంటూ గోవిందప్పతో పాటు సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్(YS Jagan) ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డికి మూడురోజుల క్రితం సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ ముగ్గురినీ విజయవాడ కమిషనరేట్ లోని సిట్ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ ముగ్గురూ నోటీసులను బేఖాతరు చేస్తూ విచారణకు గైర్హాజరయ్యారు. ఇప్పటికే వీరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు సైతం అరెస్టు నుంచి వీరికి మధ్యంతర రక్షణ ఇవ్వడానికి నిరాకరించింది. దీనితో వీరి కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపడుతున్నారు.
AP Liquor Scam Updates
జగన్ కు బాలాజీ గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అత్యంత సన్నిహితులు. ‘మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయడం, ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్పలతో పాటు ధనుంజయరెడ్డి పాత్ర ఉందనేని సిట్ అధికారుల ప్రాథమిక అనుమానం. ముడుపులుగా ఎంత మొత్తం చెల్లించాలనేదానిపై ఈ ముగ్గురూ తరచూ హైదరాబాద్, తాడేపల్లిలో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో సమావేశమయ్యేవారు’ అని సిట్ ఇప్పటికే తేల్చింది. మద్యం ముడుపుల సొమ్మును రాజ్ కెసిరెడ్డి వీరికి చేరవేస్తే… వీరు దాన్ని జగన్ కు అందజేసేవారని ఇప్పటివరకూ అరెస్టైన నిందితులకు సంబంధించిన రిమాండ్ రిపోర్టుల్లో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో మైసూరులో బాలాజీ గోవిందప్పను సిట్ అరెస్ట్ చేసింది.
Also Read : TTD: శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం ఉచితం ! ఏం చేయాలంటే ?