AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ ఎదుట హాజరైన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి
ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ ఎదుట హాజరైన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. వీరిద్దరూ ఈ కేసులో ఏ31, ఏ32 నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మే 16 వరకు తదుపరి చర్యలు చేపట్టవద్దని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, విచారణకు హాజరుకావాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని విజయవాడలోని సిట్ కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో… నాటి సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను ఇటీవల సిట్ నిందితులుగా చేర్చింది. ఈ కేసులో ఏ 33 నిందితుడుగా ఉన్న గోవిందప్ప మంగళవారం అరెస్టయిన విషయం తెలిసిందే. సిట్ అధికారులు తాజాగా ఆయన్ను విజయవాడ సీబీఐ కోర్టులో హాజరుపర్చారు.
గోవిందప్ప బాలాజీకి ఈనెల 20 వరకు రిమాండ్
ఏపీ మద్యం కేసలో 33వ నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీకి విజయవాడ ఏసీబీ కోర్టు ఈనెల 20వరకు రిమాండ్ విధించింది. దీంతో గోవిందప్పను అధికారులు విజయవాడ జైలుకు తరలించారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన రూ.వేల కోట్ల ముడుపుల సొత్తును డొల్ల కంపెనీలకు మళ్లించి ‘అంతిమ లబ్ధిదారు’కు చేర్చడంలో క్రియాశీలక పాత్ర పోషించిన భారతి సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని సిట్ అరెస్టు చేసింది. ఈ కేసులో 33వ నిందితుడి (ఏ33)గా ఉన్న ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు. జగన్ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలన్నీ చూస్తుంటారు. నెల రోజులుగా పరారీలో ఉన్న గోవిందప్ప బాలాజీ కోసం మూడు రాష్ట్రాల్లో గాలించిన సిట్ బృందాలు… కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని చామరాజనగర జిల్లా బీఆర్‌హిల్స్ అటవీ ప్రాంతంలో ఉన్నారని గుర్తించి అక్కడే మాటు వేశాయి. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఎరకనగడ్డె కాలనీలోని ఓ వెల్‌నెస్ సెంటర్ బయట ఆయన్ను అదుపులోకి తీసుకున్నాయి.
గోవిందప్ప సిట్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
ఏపీ లిక్కర్ స్కామ్ సిండికేట్ లో గోవిందప్ప బాలాజీది కీలక పాత్ర అని సిట్ ప్రాధమిక విచారణలో తేలింది. ‘‘కెసిరెడ్డికి గోవిందప్ప అత్యంత సన్నిహితుడు. ప్రధాన బ్రాండ్లు ఆపి అనుకూల బ్రాండ్ల విడుదలలో కీలక పాత్ర పోషించారు. సొంత బ్రాండ్లు మార్కెట్లోకి తీసుకొచ్చి రూ.కోట్లు కొల్లగొట్టారు. సిండికేట్‌లో గోవిందప్పది కీలక పాత్ర అని ఏపీబీసీఎల్ అధికారులు సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి చెప్పారు. డిస్టిలరీలు, సప్లయర్ల కమీషన్లు గోవిందప్పకు చేరాయి. లిక్కర్ ద్వారా వచ్చిన మొత్తాన్ని వివిధ రూపాల్లో మళ్లించారు. అక్రమ సొమ్ముతో స్థిరాస్తులు, లగ్జరీ కార్లు కొనుగోలు చేశారు. డబ్బు ఎలా మళ్లించాలో గోవిందప్పకు తెలుసు. ఇలాంటి కేసుల్లో పదేళ్ల వరకు శిక్ష పడుతుంది’’అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.