AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డికి నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాంలో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డికి నోటీసులు
AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కాంలో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ(YCP) అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితులైన సీఎంవో మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తి కాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీకి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసుల్లో స్పష్టం చేసింది.
గత వైసీపీ(YCP) ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో ముడుపులు కొల్లగొట్టేందుకు వీలుగా మద్యం విధానాన్ని రూపొందించటమే కాక, ఆ కుట్ర అమలు చేసేందుకు అనుకూల అధికారుల నియామకంలో నాటి సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డిది ప్రధాన పాత్రగా సిట్ అనుమానిస్తోంది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయటం, ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించటంలో కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్పతో పాటు ధనుంజయరెడ్డి పాత్ర ఉందని విశ్వసిస్తోంది. ముడుపులుగా ఎంత మొత్తం చెల్లించాలనే దానిపై ఈ ముగ్గురూ తరచూ హైదరాబాద్, తాడేపల్లిలో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో సమావేశమయ్యేవారు’ అని సిట్ ఇప్పటికే తేల్చింది. మద్యం ముడుపుల సొత్తంతా రాజ్ కెసిరెడ్డి వీరికి చేరవేస్తే… వీరు దాన్ని జగన్ కు చేర్చేవారని ఇప్పటివరకూ అరెస్టయిన నిందితుల రిమాండ్ రిపోర్టుల్లో ప్రస్తావించింది.
జగన్(YS Jagan) సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలన్నీ చూసే గోవిందప్ప ఛార్టర్డ్ అకౌంటెంట్. మద్యం కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్మును డొల్ల కంపెనీల ద్వారా మళ్లించడంలో ఆయనదే ప్రధాన పాత్ర. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే… ఆ సొమ్ము అంతిమంగా ఎవరికి, ఎలా చేరింది ? ఈ కుంభకోణంలో ‘అంతిమ లబ్ధిదారు’ ఎవరనేది ఆధారాలతో సహా తేలుతుందని సిట్ భావిస్తోంది. కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్పలకు ముడుపులు ఇచ్చినట్లు డిస్టిలరీల యజమానులు వాంగ్మూలాలిచ్చారు. వాటి ఆధారంగా సిట్ ఈ ముగ్గుర్ని ప్రశ్నించనుంది.
AP Liquor Scam – కృష్ణమోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు నోటీసుల అందజేసిన సిట్ అధికారులు
రిమాండ్ రిపోర్టుల్లో తమ ప్రస్తావన ఉందని తెలిసిన వెంటనే ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టులో కూడా అరెస్టు నుంచి వీరికి ఎలాంటి మధ్యంతర రక్షణ లభించలేదు. దీనితో ఏ క్షణమైనా తమను అరెస్టు చేసే అవకాశముందని భావించి వీరు ముగ్గురూ పరారైపోయారు. ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసేసి… రహస్య స్థావరాల్లో గడుపుతున్నారు. వీరి కోసం గత మూడు రోజులుగా సిట్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. అందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్, బెంగళూరుల్లోని 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. వీరి నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టాయి. వారెక్కడా అందుబాటులో లేకపోవటంతో ఈ నెల 11న వారు విచారణకు రావాలని ఆదేశిస్తూ.. కుటుంబ సభ్యులకు సిట్ అధికారులు నోటీసులిచ్చారు.
అనుమానితుల కోసం పలు చోట్ల తనిఖీలు
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఫార్చ్యూన్ వన్ టౌన్‌షిప్‌లోని ధనుంజయరెడ్డి నివాసంలో తనిఖీలు చేశారు. అత్తాపూర్ దగ్గర ఉప్పరపల్లి సన్‌రైజ్ వ్యాలీలోని పి.కృష్ణమోహన్‌రెడ్డి నివాసంలో, ఆయన కుమారుడు రోహిత్‌రెడ్డి కార్యాలయంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బుర్రి రెసిడెన్సీలోని గోవిందప్ప నివాసం, రఘురామ్ సిమెంట్స్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. బెంగళూరులోని భారతి సిమెంట్స్ అతిథిగృహం, కార్యాలయాల్లోనూ ఈ తనిఖీలు జరిగాయి. ఈ నిందితులు అక్కడ ఉండే అవకాశముందనే ఉద్దేశంతో సోదాలు చేపట్టారు.
Also Read : Telugu Students: భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతతో స్వస్థలాలకు తెలుగు విద్యార్థులు