Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌ గా పూసపాటి అశోక్ గజపతి రాజు

గోవా గవర్నర్‌ గా పూసపాటి అశోక్ గజపతి రాజు

Ashok Gajapathi Raju : గోవా గవర్నర్ గా విజయనగరం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ జాబితాలో గోవా గవర్నర్ (Goa Governor) గా అశోక్ గజపతి రాజు స్థానం దక్కించుకున్నారు. అలాగే హర్యానా గవర్నర్‌ గా ఆషింకుమార్‌ ఘోష్‌, లడాఖ్‌ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవిందర్ గుప్తా‌లను నియమించారు.

Ashok Gajapathi Raju As a Goa Governor

విజయనగరం పూసపాటి రాజ వంశానికి చెందిన అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) 1951, జూన్ 16న జన్మించారు. 75 సంవత్సరాల వయస్సు గల అశోక్… ఇప్పటికి ఏడు పర్యాయాలు ఎమ్మెల్యే గానూ, ఒక సారి ఎంపీగానూ పని చేశారు. విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన… గతంలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, చంద్రబాబు క్యాబినెట్లలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2014లో కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ లో పౌర విమానయాన శాఖ మంత్రిగా సేవలందించారు. వయోభారం కారణంగా ఇటీవల ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న అశోక్ గజపతి రాజు… ఆయన కుమార్తె అదితి గజపతిరాజును విజయనగరం అసెంబ్లీ బరిలో దించి గెలుపొందారు. గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు నియామకంపై జిల్లా టీడీపీ శ్రేణులతో పాటు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు మీడియాతో మాట్లాడుతూ… తాను ఎప్పుడు అవకాశాల కోసం పరుగెత్త లేదన్నారు. అవకాశాలు వచ్చినప్పుడు బాధ్యతగా వాటిని స్వీకరించానని ఆయన స్పష్టం చేశారు. గవర్నర్‌గా తన పేరును సీఎం చంద్రబాబు సిఫార్సు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ నియామకంతో తెలుగు వారి గౌరవాన్ని మరింత పెంచే బాధ్యత తనపై ఉందన్నారు. ఓటమితో నిరుత్సామ పడనక్కర్లేదని తెలిపారు. దాని నుంచి పాఠాలు నేర్చుకుని మరింత ఉన్నతంగా ముందుకు వెళ్లొచ్చని పేర్కొన్నారు. గోవా అనగానే మిత్రుడు, కేంద్ర మాజీ మంత్రి మనోహర్ పారికర్ గుర్తుకు వస్తారన్నారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు గుర్తు చేసుకున్నారు. దేశానికి సేవ చేసే అవకాశం మరోసారి లభించడం ఆనందంగా ఉంది. అభినందనలు తెలుపుతున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని అశోక్‌ గజపతిరాజు అన్నారు.

Also Read : MLC Kavitha: తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలపై కవిత ఫిర్యాదు

Leave A Reply

Your Email Id will not be published!