Ashok Gajapathi Raju: గోవా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన అశోక్ గజపతిరాజు
గోవా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన అశోక్ గజపతిరాజు
Ashok Gajapathi Raju : మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. గోవా రాజ్ భవన్ లోని గవర్నర్ దర్బార్ లో నిర్వహించిన ప్రమాణ స్వీకారమహోత్సవంలో అశోక్‌గజపతిరాజుతో బాంబే హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ, పలువురు ఏపీ మంత్రులు, అశోక్ కుటుంబంతో పాటు ఆయన సన్నిహితులు, బంధువులు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజును గోవా సీఎం ప్రమోద్ సావంత్, మంత్రి లోకేష్ సత్కరించారు. అశోక్ గజపతిరాజుకి ఈ సందర్భంగా పలువురు అభినందనలు తెలిపారు.
Ashok Gajapathi Raju – అశోక్ గజపతిరాజుకి అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
పూసపాటి అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) నేడు గోవా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఏ పదవి చేపట్టినా హుందాగా, ప్రజాస్వామ్యబద్ధంగా అశోక్ గజపతి రాజు వ్యవహరిస్తారని కొనియడారు. గోవా గవర్నర్‌గా నూతన బాధ్యతలను కూడా అంతే అంకితభావంతో, నిష్పక్షపాతంగా నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ సీఎం చంద్రబాబు శుభాభినందనలు తెలిపారు.
అశోక్ గజపతిరాజుకి మంత్రి నారా లోకేష్ సన్మానం
గోవా గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ విద్య. ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజుని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌ని కూడా మర్యాద పూర్వకంగా కలిశానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
Also Read : Maoists Surrenders: డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్ర నేతలు
