Assam Rifles: అస్సాం రైఫిల్స్‌ కాన్వాయ్‌పై కాల్పులు ! ఇద్దరు జవాన్ల మృతి !

అస్సాం రైఫిల్స్‌ కాన్వాయ్‌పై కాల్పులు ! ఇద్దరు జవాన్ల మృతి !

Assam Rifles : మణిపుర్‌ లో సాయుధ బలగాలపై కాల్పులు కలకలం సృష్టించాయి. రాజధాని ఇంఫాల్‌ నుంచి బిష్ణుపుర్‌ వైపు వెళ్తున్న అస్సాం రైఫిల్స్‌ (Assam Rifles) కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకొని కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరో నలుగురు జవాన్లు గాయపడినట్లు సమాచారం. ఘటన సమయంలో వాహనంలో 33 మంది జవాన్లు ఉన్నట్లు సమాచారం. ఇంఫాల్ ఎయిర్ పోర్టు నుంచి 8 కి.మీ దూరంలో ఉనన నంబోల్ సబల్ లైకై ప్రాంతంలో, ఇంఫాల్ నుంచి బిష్ణుపూర్ ప్రయాణిస్తున్న పారామిలిటరీ దళాల వాహనంపై గుర్తు తెలియని ముష్కరులు కాల్పులు జరిపినట్లు సైన్యం కూడా ధ్రువీకరించింది.

Assam Rifles Attack

ఈ ఘటనను మణిపుర్‌ గవర్నర్‌ అజయ్‌ కుమార్‌ భల్లా తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో అమరులైన జవాన్ల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. మరోవైపు మణిపుర్‌లోని సబాల్‌ లైకే ప్రాంతంలో సాయంత్రం 6గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. దుండగుల కోసం అస్సాం రైఫిల్స్‌ (Assam Rifles), రాష్ట్ర పోలీసులు సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి.

మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ఈ దాడిని ఇది రాష్ట్రానికి తగిలిన క్రూరమైన దెబ్బగా అభివర్ణించారు. ఘటన సమయంలో కాన్వాయ్‌లో మొత్తం 33 మంది సిబ్బంది ఉన్నారు. ఇద్దరు జవాన్లను కోల్పోవడం దారుణమంటూ ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. “మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారి ధైర్యం మరియు త్యాగం మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి’’ అని సింగ్ పేర్కొన్నారు.

ఆపరేషన్ సింధూర్ పై ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ ఆశక్తికర వ్యాఖ్యలు

బాలాకోట్‌ (Balakot) దాడులు చేసినప్పుడు.. ఏమీ కనిపించడం లేదంటూ తమని పదేపదే ప్రశ్నించారని వాయుసేన అధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) సమయంలో మాత్రం పక్కా ప్లానింగ్‌తో వ్యవహరించినట్లు వెల్లడించారు. ఆయన న్యూదిల్లీలో జరిగిన వార్షిక సమావేశంలో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు.

‘‘బాలాకోట్‌పై (Balakot) దాడులు చేసిన సమయంలో మన వాళ్లే చాలా ప్రశ్నించారు. మనం మనవాళ్లనే ఎక్కువ అడుగుతాము. పక్కన వాళ్ల గురించి పట్టించుకోము. అక్కడేమీ కనిపించడంలేదు అన్నారు. బాలాకోట్‌ ఉపగ్రహ చిత్రంలో కేవలం మూడు చుక్కలు కనిపిస్తున్నాయి. మాకు అక్కడ లోపల ఏం జరిగిందనే దానిపై ఇంటెలిజెన్స్‌ లేదు. వారికి చెప్పలేకపోయాం. కానీ, హ్యూమన్‌ ఇంటెలిజెన్స్‌తో అక్కడ ఎంత మంది చనిపోయారు.. అంత్యక్రియలు ఎన్ని జరిగాయనేది తెలిసింది. అయినా మనవాళ్లకు నచ్చజెప్పలేకపోయాం.

ఈ సారి (ఆపరేషన్‌ సిందూర్‌) చూడండి… మురిద్కేలో కూడా చిన్న చుక్కలానే ఉపగ్రహ చిత్రంలో కనిపించింది. కానీ, ఈ సారి జర్నలిస్టు ఒకరు దానిని కవర్‌ చేశారు. మురిద్కేలోని లష్కరే స్థావరం ఎంతగా దెబ్బతిందో తెలుస్తుంది. మా ఆయుధ సామర్థ్యాన్ని ప్రశ్నించిన వారు అక్కడి భవనంపై ఏర్పడిన రంధ్రాలను చూస్తే తెలుస్తుంది. గతం నుంచి పాఠాలు నేర్చుకొన్నాం. ఈ సారి బలమైన రాజకీయ సంకల్పంతో రక్షణ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. త్రివిధ దళాలు సీడీఎస్‌, ఇతర ఏజెన్సీలతో కూర్చొని మాట్లాడుకొని పక్కా ప్లానింగ్‌ చేసుకొన్నాయి’’ అన్నారు.

అంతకు ముందు ఏపీ సింగ్‌ మాట్లాడుతూ ఆపరేషన్‌ కోసం వాడిన ఆయుధాల వివరాలను చెప్పారు. ‘‘ఈ సారి చాలా వరకు ఇటీవల దళాల్లో చేరినవే ఉన్నాయి. వీటిల్లో అత్యధికంగా భారత్‌ కృషితో సిద్ధమైనవే. ఉగ్రవాదులే మాకు లక్ష్యాలను ఇచ్చారు.. మేము కచ్చితత్వంతో వాటిని ఛేదించాము. ఆ తర్వాత శత్రువు యుద్ధాన్ని ఆపకుండా మాతో పోరాటానికి వచ్చారు. అప్పుడు మేము వారి చాలా బేస్‌లు, ఆయుధాలు, వ్యవస్థలు, రాడార్లు, కంట్రోల్‌ కమాండ్‌సెంటర్లను ధ్వంసం చేశాము. ఇవన్నీ ఇంటర్నెట్‌లో ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.

సాయుధ పోరాట విరమణపై మావోలు సంచలన లేఖ

కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఇచ్చిన సాయుధ పోరాట విరమణ ప్రకటన తన వ్యక్తిగతమని మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో తమకు సంబంధం లేదని వెల్లడించారు. శాంతి చర్చలు జరగాలని ఈ ఏడాది మార్చ్ నుంచి తాము ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. ఆపరేషన్ కగార్ నిలిపివేసి శాంతియుత వాతావరణంలో చర్చలు జరగాలని డిమాండ్ చేశారు.

కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నారని మావోయిస్టులు పేర్కొన్నారు. శాంతి చర్చలపై అభిప్రాయాలు తెలపాలని మెయిల్ అడ్రస్ ఇవ్వడం అర్థరహితమని అన్నారు. ఇలాంటి ప్రకటనలు చేసే వారు పార్టీ అనుమతి తీసుకుని చేసుంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయుధాలు వదిలి పెడుతామని ఏకపక్షంగా అభయ్ చేసిన ప్రకటన పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉందని తెలిపారు. పార్టీలో ఎలాంటి చర్చలు జరపకుండా.. సాయుధ పోరాట విరమణ ప్రకటన చెయ్యడం తీవ్రమైన చర్య అంటూ మావోయిస్టులు షాకింగ్ ప్రకటన చేశారు.

Also Read : Rahul Gandhi: తన ఫోన్‌ నంబర్‌ షేర్‌ చేయడంపై రాహుల్‌ పై యూపీ వ్యక్తి ఆగ్రహాం

Leave A Reply

Your Email Id will not be published!