Atishi Marlena: త్రాగునీటి కోసం ఢిల్లీ మంత్రి ఆతిశీ దీక్ష !

త్రాగునీటి కోసం ఢిల్లీ మంత్రి ఆతిశీ దీక్ష !

Atishi Marlena: దేశ రాజధాని ఢిల్లీకి తాగు నీటి సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. అయితే నీటిని విడుదల చేసే బ్యారేజీ గేట్లను హరియాణా ప్రభుత్వం మూసివేయడంతో ఢిల్లీలో నీటి సంక్షోభం తలెత్తిందని… జలవనరుల శాఖ మంత్రి ఆతిశీ ఆరోపించారు. హత్నీకుండ్‌ బ్యారేజీ నిండా నీరున్నా… హరియాణా ప్రభుత్వం విడుదల చేయట్లేదని ఆమె ఆరోపించారు. వాటా ప్రకారం దక్కాల్సిన నీటిని విడుదల చేసేంతవరకూ నిరవధిక దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Atishi Marlena…

దేశ రాజధానికి హరియాణా నుంచి పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయాలన్న డిమాండ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అతిశీ చేపట్టిన దీక్ష మూడో రోజుకు చేరింది. ‘ఢిల్లీకి అందాల్సిన నీటి కంటే 100 MGD తక్కువగా హరియాణా ప్రభుత్వం విడుదల చేస్తోంది. దీనితో దాదాపు 28 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’’ అని ఆమె ‘ఎక్స్‌’ వేదికగా ఓ వీడియోను పంచుకున్నారు.

ఢిల్లీకి రావాల్సిన తాగు నీటిని విడుదల చేయాలని కోరుతూ అతిశీ(Atishi Marlena) శుక్రవారం నిరవధిక నిరాహార దీక్ష చేప్టటారు. దక్షిణ ఢిల్లీలోని భోగల్‌లో చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్, మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సరఫరా కోసం ఉత్తరప్రదేశ్, హరియాణాలపై ఢిల్లీ ఆధారపడుతోంది. వాటా ప్రకారం… హరియాణా నుంచి ఢిల్లీకి 613 MGD (రోజుకు మిలియన్‌ గ్యాలన్లు) రావాల్సి ఉంది. కానీ, హరియాణా 513 MGDలను మాత్రమే విడుదల చేస్తోందని ఆప్‌ ఆరోపిస్తోంది.

Also Read : CM Manik Saha: బంగ్లాదేశ్ ప్రధానికి పైనాపిల్స్‌ గిఫ్ట్‌గా పంపిన త్రిపుర సీఎం !

Leave A Reply

Your Email Id will not be published!