Atishi Marlena: ఢిల్లీ సీఎం రేఖాగుప్తా భర్తపై ఆప్ మాజీ సీఎం అతిశీ సంచలన ఆరోపణలు
ఢిల్లీ సీఎం రేఖాగుప్తా భర్తపై ఆప్ మాజీ సీఎం అతిశీ సంచలన ఆరోపణలు
Atishi Marlena : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా భర్త మనీశ్ గుప్తాపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ సీఎం అతిశీ సంచలన ఆరోపణలు చేశారు. మనీశ్ గుప్తా అనధికారంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు అధికారులతో సమావేశమైన ఫొటోను… మాజీ సీఎం అతిశీ(Atishi Marlena) తన అఫీషియల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేసారు. అందులో, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD), ఢిల్లీ జల్ బోర్డు (DJB), పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD), ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు (DUSIB) అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న వ్యక్తి రేఖ గుప్తా భర్త మనీష్ గుప్తా అని అతిషి(Atishi Marlena) పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Atishi Marlena Shocking Comments on Delhi CM’s Husband
‘ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త(Rekha Gupta) భర్త మనీష్ గుప్తా పలువురు అధికారులతో సమావేశమయ్యారు. గ్రామాల్లో సర్పంచిగా మహిళ ఎన్నికైతే ప్రభుత్వ విధులను ఆమె భర్తే చూసుకుంటారని మనం గతంలో వినేవాళ్లం. కానీ, ఒక మహిళా సీఎం చేయాల్సిన పనులను ఆమె భర్త చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావొచ్చు. ఆమెకు ప్రభుత్వ విధులు ఎలా నిర్వర్తించాలో తెలియదా?’ అని అతిశీ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఢిల్లీలో విద్యుత్ కోతలు, ప్రైవేటు పాఠశాలల ఫీజులు పెరిగిపోవడానికి కారణం ఆయా శాఖల్లో సీఎం ప్రమేయం లేకపోవడమేనా ? అని ప్రశ్నించారు. దీనితో ఢిల్లీ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.
ఇక ఈ ఆరోపణలను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విరేంద్ర సచ్‌దేవా తీవ్రంగా ఖండించారు. ఒక మహిళ మరొక మహిళా సీఎంపై ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రజా సేవ పట్ల తనకున్న నిబద్ధతతో రేఖ గుప్తా, DUSU స్టూడెంట్స్ యూనియన్ కార్యదర్శి పదవి నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి వరకు తన సొంత కృషితో ఎదిగారని గుర్తు చేశారు. అయినా కూడా ఆమె భర్త… ఆమెకు మద్దతు ఇవ్వడం చట్టవిరుద్ధం కాదన్నారు.
రేఖ గుప్తా భర్త మనీష్ గుప్తా ఎవరంటే ?
రేఖ గుప్తా భర్త మనీష్ గుప్తా ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త. రేఖ గుప్తా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన మనీష్ గుప్తా సంస్థ పేరు నికుంజ్ ఎంటర్‌ప్రైజెస్. మనీష్ గుప్తా కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఏజెన్సీ అసోసియేట్ కూడా. ఈ సంవత్సరం ప్రారంభంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత, రేఖ గుప్తా తన విజయానికి తన భర్తే కారణమని చెప్పుకొచ్చారు. తన రాజకీయ ప్రయాణంలో తన భర్త తనకు మద్దతు ఇచ్చాడని అన్నారు. తన విజయంలో భర్త పాత్ర గురించి అడిగినప్పుడు, ఆమె “ఖచ్చితంగా, అవును” అని చెప్పింది. ఆయన ఆమె కోసం కోసం ఎంతో చేశాడని వెల్లడించింది. అయితే భవిష్యత్తులో ఈ వివాదం మరింత పెరుగుతుందా లేదా అనేది చూడాలి మరి. ఈ విషయం పట్ల ప్రజలు ఎలా స్పందిస్తారనేది కూడా చూడాలి మరి.
Also Read : Tahawwur Rana: తహవ్వుర్ రాణా వాయిస్ శాంపిల్స్ సేకరణకు ఎన్ఐఏ ప్రణాళికలు