BC Leaders: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై గవర్నర్‌కు బీసీ సంఘాల నేతల విజ్ఞప్తి

బీసీ రిజర్వేషన్ల బిల్లుపై గవర్నర్‌కు బీసీ సంఘాల నేతల విజ్ఞప్తి

 

బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును యథాతథంగా ఆమోదించి, రాష్ట్రపతికి పంపినందుకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ నేతృత్వంలో వివిధ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సోమవారం గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపేలా గవర్నర్‌ విశిష్ట అధికారాలను ఉపయోగించాలని బీసీ సంఘాల నేతలు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను కోరారు. దేశంలో సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేసి, కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేలా సహకరించాలని గవర్నర్‌ కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన బీసీ బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపినందుకు గవర్నర్‌ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

 

అనంతరం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తామని వెల్లడించడం బీసీల పోరాట విజయంగా భావిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన 42 శాతం బీసీ బిల్లును కేంద్రం ఆమోదించి తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట రూపంలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్లు పెంచేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. గవర్నర్‌ను కలిసిన వారిలో బీసీ కులసంఘాల జేఏసీ చైర్మన్‌ కుందారం గణేష్‌చారి, కన్వీనర్‌ బాలగోని బాలరాజుగౌడ్, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్‌ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యాం కురుమ, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి.మణిమంజరి సాగర్, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.చంద్రశేఖర్‌ గౌడ్‌ తదితరులు ఉన్నారు.

 

‘‘బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 2న ఢిల్లీలో జరిగిన బీసీల పోరుగర్జన జాతీయ స్థాయిలో కులగణనపై చర్చకు వచ్చింది. కులగణన చేయలేమంటూ సుప్రీంకోర్టుకు రాతపూర్వకంగా చెప్పిన కేంద్రం… జనగణనతోనే కులగణన చేస్తామని తాజాగా ప్రకటించడం హర్షణీయం. ఇది బీసీలు చేస్తున్న పోరాటాలకు దక్కిన విజయం. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపేలా, దేశంలోని సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50% పరిమితిని ఎత్తేసేలా చొరవ తీసుకోవాలి’’ అని వినతిపత్రంలో గవర్నర్‌ ను కోరినట్లు జాజుల వెల్లడించారు.

Leave A Reply

Your Email Id will not be published!