Bedroom Jihadis: కశ్మీర్ బలగాలకు సవాల్ గా మారిన ‘బెడ్‌రూం జిహాదీలు’
కశ్మీర్ బలగాలకు సవాల్ గా మారిన ‘బెడ్‌రూం జిహాదీలు’
Bedroom Jihadis : జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులతో ఏళ్ల తరబడి ప్రత్యక్ష పోరాడిన భద్రతాదళాలు… ప్రస్తుతం మరో రహస్య శత్రువును ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇంట్లోనే కూర్చుని సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుడు సమాచార వ్యాప్తికి పాల్పడుతోన్న, వర్గ విభేదాలను రెచ్చగొడుతున్న ‘బెడ్‌రూం జిహాదీ’ల (Bedroom Jihadis) రూపంలో వారికి కొత్త సవాల్ ఎదురవుతోంది. సాంప్రదాయ ఉగ్రవాదులకు భిన్నంగా ఉండే ఈ దుర్మార్గులు జమ్మూకశ్మీర్ ను అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనికోసం సోషల్ మీడియాలో అనేక నకిలీ ఖాతాలు తెరిచినట్లు గుర్తించినట్లు వెల్లడించారు.
Bedroom Jihadis Viral
కశ్మీర్ లోయలో మత కలహాలు, అశాంతి సృష్టించాలనే లక్ష్యంతో దుష్ప్రచారం, రెచ్చగొట్టే కంటెంట్ వ్యాప్తికి పాల్పడుతున్న సోషల్ మీడియా ఖాతాల నెట్‌వర్క్‌ను అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. పాకిస్థాన్ (Pakistan) లోని ఉగ్ర సంస్థలు, వాటి సానుభూతిపరులు దీన్ని నియంత్రిస్తున్నట్లు భావిస్తున్నారు. అనేక వారాలుగా కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా వేలాది సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలు, ప్రైవేటు సందేశాలను అధికారులు విశ్లేషించారు. ఈ క్రమంలోనే ఈ సంఘ విద్రోహక కార్యకలాపాలకు పాక్‌లో ఉన్న హ్యాండ్లర్లకు ప్రత్యక్ష సంబంధం ఉందనేందుకు ఆధారాలు లభ్యమయ్యాయి.
‘‘కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్ ల సాయంతో ఈ జిహాదీలు ఎక్కడి నుంచైనా యుద్ధం చేస్తున్నారు. వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. యువతను ప్రభావితం చేస్తున్నారు’’ అని ఓ అధికారి వెల్లడించారు. ఓ సోషల్ మీడియా పోస్టు ద్వారా ఇటీవల స్థానికంగా ఇలాగే ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టారని, కానీ.. శ్రీనగర్ పోలీసులు సకాలంలో స్పందించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. మరో కేసులో.. ఓ వర్గానికి చెందినవారి వ్యక్తిగత వివరాలు సామాజిక మాధ్యమాల్లో లీకయ్యాయని తెలిపారు. ఈ వ్యవహారంలో ఓ యువకుడిని అరెస్టు చేసి విచారించగా.. పొరుగుదేశం నుంచి తనకు ఈమేరకు ఆదేశాలు వచ్చాయని చెప్పాడన్నారు.
వాస్తవానికి, 2017లోనే ఈ పెడ ధోరణి మొదలైంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం స్థానికంగా ఇంటర్నెట్‌పై ఆంక్షల వంటి చర్యలతో దీనికి అడ్డుకట్ట పడింది. అయితే.. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఈ ‘బెడ్‌రూం జిహాదీ’లు మరోసారి జడలు విప్పినట్లు అధికారులు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వారి లక్ష్యాలు కావొచ్చని చెప్పారు. ముప్పు ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటోందని ఈ పరిణామాలు చాటిచెబుతున్నాయని, దీన్ని మొగ్గలోనే తుంచేయాలని జమ్మూకశ్మీర్ మాజీ డీజీపీ కుల్దీప్ ఖోడా పేర్కొన్నారు.
Also Read : Pulivendula ZPTC: పులివెందుల, ఒంటిమిట్టలో ముగిసిన జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్
