Karpoori Thakur: ‘జన నాయక్‌’ కర్పూరీ ఠాకుర్‌ కు భారతరత్న !

‘జన నాయక్‌’ కర్పూరీ ఠాకుర్‌ కు భారతరత్న !

Karpoori Thakur: ‘జన నాయక్‌’ గా ప్రసిద్ధి పొందిన బిహార్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత కర్పూరీ ఠాకుర్‌ కు కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది. భారతదేశానికి ముఖ్యంగా బిహార్‌ ప్రజలకు చేసిన కర్పూరీ ఠాకుర్ చేసిన సేవలను గుర్తించి… ఆయన మరణించిన 36 ఏళ్లకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి ఈ పురస్కారానికి ఆమోద ముద్ర వేడయంతో… కర్పూరీ ఠాకుర్ శత జయంతికి ఒక రోజు ముందు భారతరత్న ప్రకటించింది.

బిహార్‌లోని సమస్తీపుర్‌ జిల్లాలో కర్పూరీ గ్రామంగా పేరొందిన పితౌంజియాలో గోకుల్‌ ఠాకుర్‌, రామ్‌ దులారీదేవీలకు 1924 జనవరి 24న జన్మించారు. కర్పూరీ ఠాకుర్. అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన నాయీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కర్పూరీ ఠాకుర్(Karpoori Thakur)… ఆయన విద్యార్థి దశలో ఆల్‌ ఇండియా స్టూడెంట్‌ ఫెడరేషన్‌లో చేరి రాజకీయాలు మొదలుపెట్టారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొనడానికి డిగ్రీలోనే కాలేజీ చదువులకు స్వస్తి చెప్పారు. భారత స్వాతంత్య్ర సమరంలో పాల్గొని 26 నెలలు జైలు జీవితం గడిపారు.

స్వాతంత్య్రానంతరం సొంత గ్రామం పితౌంజియా పాఠశాల అధ్యాపకుడిగా వృత్తి జీవితం ప్రారంభించిన ఆయన 1952లో తొలిసారి తాజ్‌ పుర్‌ నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై చట్టసభలో అడుగుపెట్టారు. 1988లో చనిపోయేవరకూ ఆయన 36 ఏళ్ల సుదీర్ఘ కాలం ఓటమి ఎరుగని ప్రజాప్రతినిధిగా కొనసాగారు. తొలి నుంచీ హిందీ భాషకు ప్రాధాన్యమిచ్చిన ఆయన బిహార్‌ విద్యా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన భాషల జాబితా నుంచి ఇంగ్లీష్‌ను తొలగించారు. ఆంగ్ల మాధ్యమ పాఠ్యాంశాల కారణంగా బిహారీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశంతో ఆయన ఆ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Karpoori Thakur – బిహార్‌ లో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా కర్పూరీ ఠాకుర్ !

1952లో తొలిసారి తాజ్‌ పుర్‌ నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై చట్టసభలో అడుగుపెట్టిన కర్పూరీ ఠాకుర్… 1988లో చనిపోయేవరకు 36 ఏళ్ల సుదీర్ఘ కాలం ఓటమి ఎరుగని ప్రజాప్రతినిధిగా ఉన్నారు. 1970లో సోషలిస్టు పార్టీ తరఫున బిహార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆ స్థానానికి ఎదిగిన తొలి కాంగ్రెసేతర నేతగా గుర్తింపు పొందారు. 1977 నుంచి 79 వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముంగేరీలాల్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు ఓబీసీలకు 26% రిజర్వేషన్లు అమలుచేసి వారి సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి బాటలు పరిచారు. ఓబీసీల అభ్యున్నతి కోసం ఆయన వేసిన బీజమే 90వ దశకంలో మండల్‌ కమిషన్‌ సిఫార్సుల అమలుకు ప్రాణం పోసింది.

సరళమైన జీవన విధానం, సామాజిక న్యాయ నినాదంతో బిహార్‌ ప్రజల గుండెల్లో నిలిచిపోవడమే ఆయనను ఓటమి ఎరుగని నేతగా చేసింది. జయప్రకాశ్‌ నారాయణ్‌తో సన్నిహితంగా పని చేసిన ఆయన దేశంలో అత్యవసర పరిస్థితులు విధించిన రోజుల్లో జనతా పార్టీలోని ఇతర ప్రముఖులతో కలిసి సంపూర్ణ విప్లవ ఉద్యమం నడిపించారు. 1979లో జనతా పార్టీ చీలిపోయినప్పుడు చరణ్‌సింగ్‌ వర్గంవైపు నిలిచారు. చివరిసారిగా 1985 లో సోన్‌ బర్స అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ లోక్‌దళ్‌ అభ్యర్థిగా విధాన సభకు ఎన్నికయ్యారు. ఆ పదవీ కాలం ముగియక ముందే 1988 ఫిబ్రవరి 17న 64 ఏళ్ల వయసులో కన్నుమూశారు. 36 ఏళ్లు నిరాటంకంగా బిహార్‌ విధానసభ సభ్యుడిగా కొనసాగిన ఆయనకు మరణించిన 36 ఏళ్ల తర్వాత భారతరత్న దక్కడం విశేషం.

ఠాకుర్‌ కు భారతరత్న ప్రకటించడంపై ప్రధాని మోదీ, బిహార్ సిఎం నీతీశ్ ప్రశంసలు

‘జన నాయక్‌’ కర్పూరీ ఠాకుర్‌ కు భారతరత్న ప్రకటించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ప్రశంసల వర్షం కురిపించారు. “పేదరికం అంచున నిలిచిన వారి కోసం కృషి చేసిన, సమానత్వం కోసం పోరాడిన సోషలిస్టు నేతకు దక్కిన గౌరవమిదని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. తన దార్శనికతతో భారత సామాజిక, రాజకీయ చరిత్ర గతిని మార్చిన నేత కర్పూరీ ఠాకుర్‌” అని ఆయన కొనియాడారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకుర్‌ శతజయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ ఘన నివాళులర్పించారు.

అనంతరం ‘‘సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడి కోట్లాది మంది ప్రజల జీవితాలను మార్చిన జననాయక్‌ కర్పూరీ ఠాకుర్‌ శత జయంతి నేడు. ఆయనను ప్రత్యక్షంగా కలిసే అవకాశం నాకు ఎన్నడూ రాలేదు. కానీ, ఆయన గురించి చాలా విన్నాను. అత్యంత వెనుకబడిన వర్గం నుంచి వచ్చిన ఆయన.. ఎన్నో అడ్డంకులను అధిగమించి సమాజ అభివృద్ధి కోసం పాటుపడ్డారు. ఠాకుర్‌జీ తన జీవితాంతం నిరాడంబరత, సామాజిక న్యాయం అనే రెండు స్తంభాలపైనే నిలబడ్డారు. ముఖ్యమంత్రి(CM) పదవిలో ఉండి కూడా తన కుమార్తె పెళ్లిని సొంత డబ్బులతో జరిపించారు’’ అని ప్రధాని తెలిపారు.

తన మెంటార్‌ కర్పూరీ ఠాకుర్‌కు(Karpoori Thakur) భారతరత్న ఇవ్వడాన్ని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ప్రశంసించారు. తమ పార్టీ ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండు నెరవేరిందని అభిప్రాయపడ్డారు. ఇది అణగారిన వర్గాలకు సానుకూల సందేశాన్నిస్తుందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Also Read : BRS MLA’s Response : సీఎంతో భేటీ పై వస్తున్న వార్తలకు చెక్ పెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Leave A Reply

Your Email Id will not be published!