Bhatti Vikramarka: విశాఖలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
విశాఖలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
Bhatti Vikramarka : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విశాఖపట్నంలో పర్యటించారు. విశాఖలో నిర్వహించిన ‘స్టాప్ ఓట్ చోరీ’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. తెలంగాణ తెచ్చుకున్నదే నదీ జలాల కోసం, బీడు భూములను సాగులోకి తెచ్చుకోవడం కోసమని చెప్పిన భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) … వరద జలాలపై ఇరు రాష్ట్రాల వాటా తేలిన తర్వాత కొత్త ప్రాజెక్టులు నిర్మించుకుంటే న్యాయబద్ధంగా ఉంటుందన్నారు. ‘మా అవసరాలు తీరకుండా దిగువ ప్రాజెక్టులు నిర్మిస్తే.. ఆ తర్వాత కేటాయింపుల సమస్యలు ఎక్కువవుతాయి’ అని భట్టి అన్నారు.
Deputy CM Bhatti Vikramarka in Visakhapatnam
‘‘సముద్రంలోకి వెళ్లే జలాలు అని మాట్లాడటం సరికాదు. గోదావరిపై మేం చేపట్టిన ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదు. ఇరు రాష్ట్రాల వాటా తేలిన తర్వాతే ప్రాజెక్టులు కట్టుకుంటే న్యాయంగా ఉంటుంది. మా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిన తర్వాత మిగులు జలాలుంటే వాడుకోవచ్చు. మా అవసరాలు తీరకుండా దిగువన ప్రాజెక్టులు నిర్మిస్తే కేటాయింపుల్లో సమస్య వస్తుంది’’అని భట్టి అన్నారు. నీటి వాటాలను తేల్చాల్సిన బాధ్యత కేంద్రానిది అని చెప్పిన భట్టి (Bhatti Vikramarka) … రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పారు. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్, దేవాదులు వంటి గోదావరిపై మేం చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి కాలేదని.. మా ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత వాటాలు తేల్చి మిగిలిన వాటిని సమృద్ధి గా వాడుకోవచ్చని ఆయన అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్లో విభేదాల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా భట్టి… తెలంగాణ కాంగ్రెస్లో అసమ్మతి లేదని వ్యాఖ్యానించారు. పార్టీ బలంగా ఉండాలని రాజగోపాల్రెడ్డి కూడా కోరుతున్నారని భట్టి చెప్పుకొచ్చారు. భవిష్యత్ లో ఏపీలో కూడా కాంగ్రెస్ బలపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు, రేవంత్, రాహుల్ గురించి వైఎస్ జగన్ హాట్ లైన్ వ్యాఖ్యలపై స్పందించిన భట్టి… అవి వ్యక్తిగతమైన రాజకీయ ఆరోపణలు అని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పార్టీ విధానాలు విశాలమైన ప్రయోజనాలతో ఉంటాయి తప్ప సంకుచితమైన మనస్తత్వంతో ఉండవన్నారు.
Also Read : CM Revanth Reddy: నా గెలుపే ప్రత్యర్థులకు దుఃఖం – సీఎం రేవంత్రెడ్డి
