Bhopal: మానవత్వం చూపినందుకు 13 నెలలు జైలు జీవితం గడిపిన వ్యక్తి

మానవత్వం చూపినందుకు 13 నెలలు జైలు జీవితం గడిపిన వ్యక్తి

Bhopal : మానవత్వంతో ఎదుటి మనిషికి సహాయం చేసి… అనుకోని పరిస్థితుల్లో ఓ వ్యక్తి 13 నెలలు జైలు జీవితం అనుభవించిన ఘటన భోపాల్ (Bhopal) లో వెలుగు చూసింది. ఎదురింటిలో అనారోగ్యంతో ఉన్న మహిళను… మానవత్వంతో హాస్పిటల్‌ లో జాయిన్ చేయడం అతని కొంప ముంచింది. 13 నెలల పాటు జైలు జీవితం గడిపేలా చేసింది. చివరకు అతని నిర్ధోషి అని తేలడంతో ఎట్టకేలకు జైలు నుండి విడుదలయ్యాడు. మధ్యప్రదేశ్‌ లోని భోపాల్‌ (Bhopal) లో ఓ సామాన్యుడికి ఎదురైన వింత పరిస్థితి గురించి తెలిస్తే షాక్ అవక తప్పదు.

Bhopal Man Jailed for Showing Humanity

భోపాల్‌ (Bhopal) లోని ఆదర్శ్‌నగర్‌ కు చెందిన రాజేశ్ అనే వ్యక్తి దినసరి కూలీగా పని చేస్తున్నాడు. అక్కడే స్లమ్ ఏరియాలో ఒంటరిగా నివసిస్తున్నాడు. గతేడాది జూన్‌ లో రాజేశ్ ఎదురింటి మహిళ అనారోగ్యానికి గురైంది. ఆమెకు ఎవరూ లేకపోవడంతో రాజేశ్ ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లి జాయిన్ చేశాడు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. దీనితో పోలీసులు రాజేశ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు రాజేశ్ భయపడుతూ సమాధానాలు చెప్పాడు. రాజేశ్ తడబడుతుండడంతో అతడే ఆమెను చంపేసి ఉంటాడని పోలీసులు భావించారు. అతడిని అరెస్ట్ చేశారు. ఆమెది హత్య అని, రాజేశ్ ఆమెను గొంతు కోసి చంపేశాడని ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. అతడి అరెస్ట్ గురించి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదు.

రాజేశ్ పేదవాడు కావడంతో అతడు తన తరఫున లాయర్‌ను పెట్టుకోలేకపోయాడు. దీనితో కోర్టు అతడి కేసును ప్రభుత్వ న్యాయవాదికి అప్పగించింది. రంగంలోకి దిగిన న్యాయవాది రాజేశ్‌ ను కలుసుకుని ప్రశ్నించాడు. ఆమెను తాను చంపలేదని, అనారోగ్యంతో ఉన్న ఆమెను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశానని లాయర్‌కు చెప్పాడు. మెడికల్ రిపోర్ట్‌ లో కూడా ఆమె అనారోగ్యంతోనే మృతి చెందిందని ఉండడంతో లాయర్ పోలీసులను ప్రశ్నించాడు. దీనితో అసలు విషయం బయటపడింది. కేసు క్లోజ్ చేయడం కోసం పోలీసులు అలా చేశారని తెలిసింది.

ఆమె మరణంలో రాజేశ్ పాత్ర లేదని తేలడంతో న్యాయస్థానం అతడిని విడుదల చేసింది. 13 నెలల జైలు జీవితం తర్వాత విడుదలైన రాజేశ్ జీవితం మరింత దుర్భరంగా మారింది. తన కుటుంబం రోడ్డున పడిందని, తాను జైలుకు వెళ్లానని తెలిసి ఎవరూ పని ఇవ్వడం లేదని రాజేశ్ వాపోతున్నాడు. 13 నెలల క్రితం పోలీసులు తన ఇంటికి తాళం వెయ్యడంతో అప్పట్నుంచి ఇంటికి అద్దె చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.

Also Read : Minister Nadendla Manohar: ఆగస్టు 25 నుంచి 31 వరకు స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ – మంత్రి నాదెండ్ల మనోహర్‌

Leave A Reply

Your Email Id will not be published!