Bhupesh Baghel: మద్యం కుంభకోణం కేసులో మాజీ సీఎం కుమారుడి అరెస్టు
మద్యం కుంభకోణం కేసులో మాజీ సీఎం కుమారుడి అరెస్టు
Bhupesh Baghel : ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గట్టి షాకిచ్చింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయన కుమారుడు చైతన్య బఘేల్‌ను (Bhupesh Baghel) ఈడీ శుక్రవారం అరెస్టు చేసింది. ఈ ఉదయం దుర్గ్ జిల్లాలోని భిలాయ్ ప్రాంతంలో ఉన్న బఘేల్ నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు… అనంతరం చైతన్యను కస్టడీలోకి తీసుకున్నారు.
Bhupesh Baghel Liquor Scam Case
2019-2022లో భూపేశ్ బఘేల్ (Bhupesh Baghel) నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం జరిగిందని… ఇందులో రూ.2,160 కోట్ల కుంభకోణం జరిగిందని ఈడీ అధికారులు చెబుతున్నారు. అలాగే ఇందులో చైతన్య బఘేల్ పాత్ర ఉందనీ వారు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ.. మద్యం సిండికేట్‌కు రూ.రెండు వేల కోట్ల మేర లబ్ధి చేకూరిందని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి గతంలో బఘేల్ నివాసంలో సోదాలు నిర్వహించిన దర్యాప్తు సంస్థ.. శుక్రవారం మరోసారి తనిఖీలు చేపట్టింది. ఈ ఉదయం దుర్గ్ జిల్లాలోని భిలాయ్ ప్రాంతంలో గల బఘేల్ నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు.
కేసుకు సంబంధించి కొత్త ఆధారాలు లభించడంతో మాజీ సీఎం నివాసంలో సోదాలు చేపట్టారు. అయితే, ఈ సమయంలో చైతన్య బఘేల్ అధికారులకు సహకరించకపోవడంతో ఆయనను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం నుంచి బఘేల్ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసు సిబ్బంది మోహరించారు. పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకొని ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బర్త్‌డే రోజు మంచి గిఫ్ట్ – భూపేశ్ బఘేల్
కాగా, చైతన్య పుట్టినరోజు నాడే ఆయన్ను అరెస్టు చేయడంపై భూపేశ్ స్పందించారు. ‘నా కుమారుడికి పుట్టినరోజు నాడు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ప్రపంచంలోని ఏ ప్రజాస్వామిక దేశంలోనూ మోదీ, అమిత్‌షా ఇచ్చినట్టు వంటి బర్త్‌డే గిఫ్ట్ ఇంకెవ్వరూ ఇవ్వరు’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు నేడు చివరి రోజు. అదానీ సంస్థ కోసం చెట్లు కూలుస్తున్న అంశాన్ని మేం లేవనెత్తాం. వెంటనే మా ఇంటికి ఈడీని పంపించారు. అందుకే వెంటనే మోదీ, అమిత్‌షా.. ఈడీ అధికారులను పంపారని, వారి మెప్పుపొందేందుకు అధికారులు దాడులు జరిపారని, ఇలాంటి బెదిరింపులకు తాము భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఒకవైపు ఎన్నికల కమిషన్ సాయంతో బిహార్‌లో ఓటర్లను తొలగిస్తూ ప్రజాసామ్యాన్ని పరిహసిస్తున్నారని, మరోవైపు విపక్ష నేతలను అణచివేసేందుకు ఈడీ, ఐటీ, సీబీఐ, డీఆర్‌ఐలను ఉసిగొలుతున్నారని ఆరోపించారు. ఇవన్నీ ప్రజలకు బాగా తెలుసునని అన్నారు.
Also Read : AK-203 Rifle: భారత్ కా షేర్ ‘ఏకే 203’ ! నిమిషానికి 700 బుల్లెట్లు ఫైర్ !
